ఏమిటీ తొమ్మిదో షెడ్యూల్ ప్రాధాన్యత? ‘కాపు’లకు రాజ్యాంగ బద్దత లభిస్తుందా.. మోదీ కరుణిస్తారా?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణనీయ ప్రాతినిధ్యం గల సామాజిక వర్గం 'కాపులు'. 1990వ దశకం నుంచి బీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని కాపులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం 1993లో చేపట్టిన ఆందోళన అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతికూల ఫలితాలను తెచ్చి పెట్టింది. తర్వాత పదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. తర్వాత పెల్లుబుకిన ప్రజా వ్యతిరేకత.. అణచివేత విధానాల ఫలితంగా 2004లో ఓటమి పాలైన టీడీపీ 2014 వరకు విపక్షంలోనే కొనసాగుతూ వచ్చింది.

2014లో రాష్ట్ర విభజన.. అధికారంలోకి రావడం టీడీపీకి తప్పనిసరి పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే 2012 - 13లో నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం చంద్రబాబు 'వస్తున్న మీ కోసం' పేరుతో నిర్వహించిన పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 ముద్రగడ ఆమోదంతో మంజునాథ కమిషన్ నియామకం ఇలా

ముద్రగడ ఆమోదంతో మంజునాథ కమిషన్ నియామకం ఇలా

తీరా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల రిజర్వేషన్ల కల్పించడం సంగతి విస్మరించారు ఏపీ సీఎం చంద్రబాబు. ముద్రగడ పద్మనాభం మరోసారి ఆందోళన చేపట్టాక గతేడాది జనవరిలో మంజునాథ కమిషన్ దాఖలు చేశారు. పదేపదే వాయిదాలు వేసిన తర్వాత ఆగమేఘాల మీద.. నిజం చెప్పాలంటే గుట్టు చప్పుడు కాకుండా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. అందుకే చంద్రబాబు ప్రభుత్వం వేగంగా బిల్లు ఆమోదించడంతోపాటు అదే స్పీడ్‌లో కేంద్రానికి తీర్మానం ప్రతిని పంపింది. కేంద్రం ఆమోదించి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి. ఈ రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలి. ఆ తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

కాపులతో కలిపి మొత్తం 55 శాతానికి చేరిన రిజర్వేషన్లు

కాపులతో కలిపి మొత్తం 55 శాతానికి చేరిన రిజర్వేషన్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే ఎస్‌సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. కాపు రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 55 శాతానికి చేరినట్లు అవుతోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల కాపు రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాల్సి వస్తోంది. ఒకవేళ తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చినా సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేపట్టదన్న గ్యారంటీ లేదన్నది నిష్ఠూర సత్యం. ఏదైనా ఒక చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం పెద్ద ప్రక్రియ. ముందుగా అందుకు కేంద్ర కేబినెట్‌ అంగీకరించాలి. ఆ తర్వాత చట్టసభలు దాన్ని ఆమోదించాలి. ఈ నేపధ్యంలో 9వ షెడ్యూలు ప్రాధాన్యం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

 ఇదీ రిజర్వేషన్ల అమలుపై తమిళనాడు అనుభవం

ఇదీ రిజర్వేషన్ల అమలుపై తమిళనాడు అనుభవం

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని 1992లో ఇందిరా సాహ్నీ - యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి ‘మండల్‌ తీర్పు' గా పేరొచ్చింది. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్రాల పరిధిలో రిజర్వేషన్లకు 50 శాతం గరిష్ఠ పరిమితిగా ఉండిపోయింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌, హర్యానా, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని కులాల వారికి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు చేసినా సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం గరిష్ఠ్ట పరిమితి అడ్డుగా నిలిచింది. ఈ నేపధ్యంలో రాష్ట్రాలు తెచ్చిన రిజర్వేషన్ల చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చాలనే డిమాండ్‌ బయలుదేరింది.
ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే నాటికే తమిళనాడులో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. పెంచిన రిజర్వేషన్లను రద్దు చేయటం అసాధ్యంగా మారింది. అందువల్ల తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చింది.

మౌలిక సూత్రాలకు భంగకరమైతే న్యాయ సమీక్ష తప్పనిసరి

మౌలిక సూత్రాలకు భంగకరమైతే న్యాయ సమీక్ష తప్పనిసరి

తొమ్మిదో షెడ్యూలులో చేర్చిన చట్టాలు న్యాయసమీక్షకు అతీతమనే వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. తమిళనాడు రిజర్వేషన్ల చట్టంపై దాఖలైన (ఐఆర్‌ కోయెల్‌హో- వర్సెస్‌- స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు కేసు) పిటిషన్‌పై 2007లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైకే సభర్వాల్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెబుతూ.. 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలన్నీ న్యాయసమీక్షకతీతం కాదని స్పష్టం చేసింది. ఆ చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగకరంగా ఉంటే వాటిని సమీక్షించవచ్చని పేర్కొంది. ఈ తీర్పుతో 1973 తర్వాత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలను సమీక్షించే అవకాశం న్యాయస్థానాలకు లభించింది.

 ఆర్టికల్ 31 - బీ పరిధిలోకి ఇలా తేవాలి

ఆర్టికల్ 31 - బీ పరిధిలోకి ఇలా తేవాలి

రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలను న్యాయస్థానాలు సమీక్షించలేవనే అభిప్రాయం ఉంది. భూ సంస్కరణలకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో 1951లో అప్పటి ప్రధారి జవహర్‌లాల్‌ నెహ్రూతొలి రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదో షెడ్యూల్ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇందులో ఇప్పటివరకూ ప్రభుత్వం 284 చట్టాలను చేర్చింది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు కల్పించే తమిళనాడు రిజర్వేషన్ల చట్టం కూడా ఇందులో ఒకటి. ఏదైనా ఒక చట్టాన్ని 9వ షెడ్యూలులో చేర్చితే, ఆర్టికల్‌ 31- బీ ప్రకారం ఆ చట్టాన్ని న్యాయస్థానాలు సమీక్షించలేవు. కానీ తొమ్మిదో షెడ్యూలులో చేర్చిన 30 చట్టాలపై న్యాయస్థానాల్లో ఫిర్యాదులు దాఖలయ్యాయి. వీటిని న్యాయస్థానాలు విచారిస్తున్నాయి.

 పోలవరంపై వివాదం దాటవేతకే చంద్రబాబు వ్యూహం ఇలా

పోలవరంపై వివాదం దాటవేతకే చంద్రబాబు వ్యూహం ఇలా

ఆగమేఘాలపై కాపులకు రిజర్వేషన్లు కల్పించడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్య్యవస్థీకరణ చట్టం ప్రకారం ‘పోలవరం' ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. దీని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. కానీ 2014లో కేంద్రంలోని ఎన్డీఏ మిత్రపక్షంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు దాని ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్ర పరిధిలోకి తెచ్చారు. మూడున్నరేళ్ల కాలక్షేపం తర్వాత అంచనాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపకముందే కాపర్ డ్యామ్, స్పిల్ వే తదితర నిర్మాణాలకు విడిగా టెండర్లు పిలవడం కేంద్రానికి ఇబ్బందికరంగా మారింది. టెండర్లు పిలుస్తూ తీసుకున్న నిర్ణయాలను ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయకపోవడం మరింత అనుమానాలకు తావిచ్చింది. అందుకే తక్షణం పనులు నిలిపేయాలని కేంద్రం లేఖ రాయడం.. దానిపై నమస్కారం పెట్టి కేంద్రానికి అప్పగిస్తామని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బలహీనతలు కేంద్రానికి తెలుసు.

 చంద్రబాబు బలహీనతలకు కేంద్రానికి తెలుసు

చంద్రబాబు బలహీనతలకు కేంద్రానికి తెలుసు

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో చిక్కుకుని మధ్యేమార్గంగా కేంద్రం సాయంతోనే బయటపడి ఆగమేఘాలపై విజయవాడకు మకాం మార్చేసిన నేపథ్యం చంద్రబాబుది. కేంద్రంతో వ్యవహారం అన్నప్పుడు పారదర్శకంగా వ్యవహరిస్తేనే నిధులు మంజూరు కావు. సకాలంలో వివరాలు అందచేయకుండా అనుమానాస్పదంగా వ్యవహరించినప్పుడు.. సహజంగానే పనులు నిలిపేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అనుకూల మీడియా అండదండలతో ముందుగా వార్తలు ప్రజల్లోకి వదిలిపెట్టి.. తర్వాత ప్రభుత్వ సారథిగా ప్రతిస్పందించారు చంద్రబాబు..తన బలహీనతల కారణంగానే 24 గంటల్లోనే మాట మార్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం కోర్టులోకి ‘రిజర్వేషన్ల బంతి'ని నెట్టేశామని.. కాపులకు రిజర్వేషన్ల కల్పించడంపై తాము చేయాల్సిందంతా చేస్తున్నామని తాజాగా చంద్రబాబు చెప్పారు. అయితే పోలవరం.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమైన ఏపీ సీఎం చంద్రబాబు..కాపులకు రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఒప్పించగలరా? అన్నది అనుమానమే.

 మంజునాథ నివేదిక లేకుండా కాపుల రిజర్వేషన్లకు ఆమోదమా?

మంజునాథ నివేదిక లేకుండా కాపుల రిజర్వేషన్లకు ఆమోదమా?

అందుకే కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని.. అదీ తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేయడం రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణలకు కంటగింపుగా మారింది. ప్రతిదానికి వంకలు పెట్టడం ఆనవాయితీగా మారిందని నారాయణ, చిన రాజప్ప విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు మంజునాథ కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల నివేదిక తీసుకుని బిల్లు రూపొందించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కానీ కమిషన్ చైర్మన్‌గా మంజునాథ ఇచ్చే నివేదిక మాత్రమే అధికారికం. రెండు, మూడు రోజుల్లో తాను రూపొందించిన నివేదికను కమిషన్ కార్యదర్శి క్రుష్ణమోహన్ ప్రభుత్వానికి సమర్పిస్తారని తేల్చేశారు. దీంతోనే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులో డొల్లతనం బయటపడుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kapu reservations came into turmoil in Andhra Pradesh. Before 2014 then TDP president & present AP CM Chandrababu assured reservations to Kapu's in 'Vastunna Meekosam' Yatra. After coming to power in AP Chandrababu neglected.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి