భార్యల్ని కొడితే ఢిల్లీ నుండి వస్తా: నిర్మలా సీతారామన్
ఏలూరు: దత్తత గ్రామాల్లో పురుషులు మద్యం తాగి ఆడవాళ్లను కొట్టినట్లు తెలిస్తే ఢిల్లీ నుండి వచ్చి మహిళల తరఫున పోరాడుతానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. ఆమె ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మడంలంలో తన దత్తత గ్రామాలు అయిన తూర్పు తాళ్లు, పెద్దమైనవానిలంక గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దడానికి ప్రజలు సహకరించాలని కోరారు. గతంలో ఇక్కడ చాలాసార్లు పర్యటించానని, ప్రజల స్థితిగతులు, ఇతర విధానాలు తనకు తెలుసునని చెప్పారు. మద్యం తాగి మహిళలను కొట్టడం, వేధించడం చేస్తే ఊరుకునేది లేదన్నారు.
దీనికోసం రెండు గ్రామాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా సామాజిక భవనాలు నిర్మిస్తామని చెప్పారు. మహిళలు అంతా ఇక్కడకు చేరుకొని తమ ఇబ్బందులు చెప్పుకోవచ్చునని పేర్కొన్నారు. భర్తలు కొడితే వారు ఇక్కడకు వచ్చి పశ్చాత్తాపపడి వెళ్లే వరకు వెళ్లకూడదన్నారు.

ఈ సామాజిక భవనాల్లో మహిళలు, పిల్లల కోసం పుస్తకాలు, ఇతర శిక్షణ సామాగ్రి, నిరంతర విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్ారు. దత్తత గ్రామాల్లో అవసరాల పైన ఢిల్లీ బృందాలతో పాటు, నరసాపురం వైయస్ కళాశాల యువత సర్వే చేస్తుందన్నారు. ఈ గ్రామాల గొప్పతనం వివరాలు అందులో ఉంచుతామన్నారు.
అంతకుముందు నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పాలకొల్లులో పర్యటించారు. ఉదయం ఆడ శిశువులను కాపాడాలనే నినాదంతో సేవ్ గర్ల్ పేరిట 2కే రన్ జరిగింది. దీనిని ఆమె ప్రారంభించారు. ఈ రన్‌లో పాఠశాలల విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో యువత పాల్పంచుకుంది.
లింగ నిర్థారణ పరీక్షలతో పాటు భ్రూణ హత్యలను నివారించాలని ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆమె ఏపీలోని పెదమైనవానిలంక, తూర్పుతాళ్ల గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇక్కడ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. తాను దత్తత తీసుకున్న గ్రామాలను మూడేళ్లలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. పీఎం లంక, తూర్పు తాళ్ల గ్రామాల వెబ్ సైట్ ప్రారంభిస్తానని చెప్పారు. సముద్రపు కోత నివారణకు నిపుణులతో అధ్యయనం చేయిస్తామన్నారు.












Click it and Unblock the Notifications