విశాఖలో నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు- 3 రాజధానులకోసం- వైసీపీ మద్దతుతో
ఏపీలో అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానులుగా సాగుతున్న అధికార, విపక్షాల పోరులో మరో అంకానికి తెరలేచింది. మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా విశాఖ కేంద్రంగా ఇవాళ నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. ఓవైపు అమరావతి రాజధాని కోసం రైతులు పాదయాత్రగా విశాఖ వైపుగా వెళ్తున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకోవాలంటూ వైసీపీ నేతలు పిలుపునిస్తున్నారు. ఇదే క్రమంలో నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది.

విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతుగా విశాఖలో ఇవాళ నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. హనుమంతు లజపతిరాయ్ ఛైర్మన్, దేములు మాస్టర్ కన్వీనర్ గా ఈ జేఏసీ ఏర్పాటు చేశారు.ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్ధులు, ప్రజాసంఘాల నేతలతో దీన్ని ఏర్పాటు చేశారు. అందరినీ ఒకేతాటిపైకి తెచ్చి ఉద్యమం చేయబోతున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.

మూడు రాజధానుల ఉద్యమం
రాజధాని-అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకే నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసినట్లు నేతలు ఇవాళ ప్రకటించారు. విస్తృత సమావేశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధానాలపై స్పందించ బోమని జేఏసీ నేత హనుమంతు లజపతిరాయ్ ప్రకటించారు. అందరం అభివృద్ధి చెందాలన్నదే నినాదంతో ముందుకెళ్తామన్నారు.విశాఖ రాజధాని, అన్ని ప్రాంతాల అభివృద్ధికోసమేనని ఈ సమావేశాంలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ తెలిపారు.

వైసీపీ అండగా జేఏసీ యాక్షన్ ప్లాన్?
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన నాన్-పొలిటికల్ జేఏసీ మూడు రాజధానుల కోసం కార్యాచరణ రూపొందించబోతోంది. ఇందులో భాగంగా ప్రజల్లో వికేంద్రీకరణపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టబోతోంది. అలాగే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించబోతోంది. ప్రభుత్వ ఉద్దేశమైన మూడు రాజధానులకు మద్దతుగా జరిగే ఈ నాన్-పొలిటికల్ జేఏసీ కార్యకలాపాలకు అదే ప్రభుత్వం మద్దతు కూడా లభించబోతోంది.
ఇవాళ నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు కార్యక్రమంలో విశాఖ, అనకాపల్లి, అరకు జిల్లాలకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరై మద్దతు తెలిపారు. ఇందులో ఇతర పార్టీల నేతలెవరూ పాల్గొనలేదు. దీంతో ఈ నాన్-పొలిటికల్ జేఏసీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications