ఎన్టీఆర్, అక్కినేని రాష్ట్రాన్ని విభజించాలన్నారు: కెటిఆర్
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని కోరుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభలో చర్చ సాగింది. ఈ సమయంలో కెటిఆర్ మాట్లాడారు.
1972లో జై ఆంధ్ర సమయంలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావులు సంయుక్తంగా ఓ ప్రకటన చేశారని కెటిఆర్ చెప్పారు. జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో.. 1969లో తెలంగాణ కోసం తెలంగాణ సోదరులు, ఇప్పుడు ఆంధ్రా సోదరులు విడిపోవాలనే భావనతో అసువులు బాస్తున్నారని, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పాటు చేసి సుఖశాంతులు వర్ధిల్లేలా చేయాలని వారిద్దరు కేంద్రానికి లేఖ రాశారన్నారు.

హైదరాబాదుపై అసంబద్ద వాదన
హైదరాబాదు పైన అసంబద్ద వాదనలు చేస్తున్నారని కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనివార్యమని, ఆగదని అందరికీ తెలుసునని చెప్పారు. హైదరాబాదు అందరిదని, హైదరాబాదు తెలంగాణకు చెందినదన్నారు.
తెలంగాణ వారు సంస్కారవంతులన్నారు. ఎక్కడో యుగొస్లేవియాలో పుట్టిన థెరిసాకు భారతరత్న ఇచ్చామని, మాజీ మంత్రి శంకర రావు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీకి గుడి కట్టేందుకు సిద్ధమయ్యారని కెటిఆర్ చెప్పారు. హైదరాబాదు పేరును బద్నామ్ చేసింది సీమాంధ్ర నేతలే అన్నారు.












Click it and Unblock the Notifications