ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ ప్లాట్లు వేలం.. మిడిల్ క్లాస్ వారికి సూపర్ ఛాన్స్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల నిజం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లలో ప్లాట్ల వేలానికి సంబంధించి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాట్ల కేటాయింపు వేలానికి సంబంధించి ఆర్థిక స్తోమత ఉన్న వారు ఎవరైనా సరే ఈ వేలంలో పాల్గొనేలా మార్గదర్శకాలను రూపొందిస్తోంది.
వైయస్సార్ ఎంఐ జి టౌన్షిప్ లే ఇప్పుడు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లు
గత ప్రభుత్వం వైయస్సార్ ఎంఐ జి టౌన్షిప్ లను ప్రారంభించింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లుగా మార్చి, ప్లాట్ల కేటాయింపులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ టౌన్షిప్ లలో లాటరీల ద్వారా ప్లాట్లను కేటాయించారు. కానీ ఇప్పటివరకు చాలావరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు.

కొత్త మార్గదర్శకాలు
లాటరీ ఇళ్లలో వచ్చిన ప్లాట్లు వాస్తు లేదని, తమకు నచ్చలేదని ఇలా రకరకాల కారణాలతో ఇప్పుడు వరకు చాలామంది రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. దీంతో ఆ ప్లాట్లు అలాగే ఉండిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం వీటికి ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లుగా పేరుమార్చి వేలం వేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటుచేసి వారి సూచనల ప్రకారం కొత్త మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనుంది.
ఆర్ధిక స్తోమత ఉన్న ఎవరైనా వేలంలో పాల్గొనవచ్చు
వేలం వేయడం ద్వారా ప్లాట్ల నెంబర్ల వారీగా ప్లాట్ ను చూసుకొని నచ్చిన వారి వేలంపాటలో పాల్గొంటారు. ప్లాట్ ను నిజంగా నచ్చినవారే వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఇందులో ప్లాట్ తీసుకోవాలంటే వార్షికాదాయం 18లక్షలు ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో అప్పుడు చాలామందికి అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆ నిబంధనను సడలించి ఆర్థికస్తోమత ఉన్న ఎవరైనా సరే వేలంలో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
వేలంలో పాల్గొనాలంటే ఇలా చెయ్యాలి
అయితే ఈ వేలంలో పాల్గొనాలి అని భావించేవారు ముందుగా ప్లాట్ విలువలో 10 శాతం చెల్లించాలి. ఒకవేళ ఆ ప్లాట్ వీరికి దక్కకపోతే ముందు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వరు. దీనికి ఇష్టమైతేనే వారు డబ్బు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. ఇక ప్రభుత్వం నిర్వహించే ఈ వేలం ద్వారా రెండు నుంచి నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తుందని ఒక అంచనా. ఈ డబ్బుతో టౌన్షిప్ లో మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్లాట్ల వేలానికి సంబంధించి త్వరలోనే నూతన మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.












Click it and Unblock the Notifications