పోలవరం డిజైన్ మార్చం: సభలో తెలంగాణ, ఒడిశాలకు తేల్చిచెప్పిన కేంద్రం
పోలవరం ప్రాజెక్టు డిజైన్ పైన తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గడ్ రాష్ట్రాల ఎంపీలు గురువారం నాడు లోకసభలో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ స్పందించారు.
న్యూఢిల్లీ/ఆంధ్రప్రదేశ్: పోలవరం ప్రాజెక్టు డిజైన్ పైన తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గడ్ రాష్ట్రాల ఎంపీలు గురువారం నాడు లోకసభలో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ స్పందించారు. పోలవరం డిజైన్ ఇప్పుడు మార్చడం కుదరదని చెప్పారు.
తెరాస ఎంపీ సీతారాం నాయక్, బీజేడీ ఎంపీ బలభద్ర మాఝీ తదితరులు ఈ ప్రాజెక్టు పైన ఆందోళన వ్యక్తం చేశారు.
పోలవరం నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆ ప్రాజెక్టు వల్ల భద్రాచలంలోని రామాలయం ముంపునకు గురయ్యే ప్రమాదముందన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.
పెద్ద ప్రాజెక్టు కడితే విపత్తులు సంభవించినప్పుడు లక్షల మంది పైన ప్రభావం పడుతుందని ఒడిశా ఎంపీ బలభద్ర మాఝీ అన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది నిర్వాసితులు అవుతారని చెప్పారు. ఈ ప్రాజెక్టును పెద్ద ప్రాజెక్టు కాకుండా 3 బ్యారేజీలు నిర్మించాలని హనుమంత రావు సూచించారన్నారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల ఆదివాసులు నిర్వాసితులు అవుతారన్నారు. పోలవరం పనుల పురోగతి పైన ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. చత్తీస్‌గఢ్,ఒడిశాలలో ఈ ప్రాజెక్టు విషయమై గ్రామ సభలు నిర్వహించలేదన్నారు. దీనిపై కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు.
2014లోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ చెప్పారు. పోలవరం పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీలో 221 గ్రామాలు ముంపునకు గురవుతాయని చెప్పారు. ఒడిశా, చత్తీస్‌గడ్ రాష్ట్రాలలో గ్రామ సభలను నిర్వహించాల్సి ఉందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం నిర్మాణంలో మార్పులు సాధ్యం కాదని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయం ముంపు ప్రాంతంలోకి రాదని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications