జనం విజ్ఞప్తులే ఆధారంగా వైసీపీ మేనిఫెస్టోలో మరిన్ని కొత్త పథకాలు- బస్సు యాత్రకు చిన్న బ్రేక్
YS Jagan Bus Yatra: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్తోంది. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి ధీటుగా బహిరంగ సభలను నిర్వహిస్తోంది.
కిందటి నెల 27వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయ వద్ద పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు. గుడ్ ఫ్రైడే నాడు మినహా నిరాటంకంగా ఈ యాత్ర సాగింది. ఎనిమిది రోజులను పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది రోజుల్లో రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో పర్యటించారు వైఎస్ జగన్.

కడపలో యాత్రను ఆరంభించిన అనంతరం నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల మీదుగా నెల్లూరుకు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడే బస చేశారు. నేడు తొమ్మిదో రోజు యాత్ర ప్రారంభం కావాల్సిన ఉంది గానీ- విరామం ప్రకటించారు.
రాయలసీమ జిల్లాల్లో సాగిన బస్సు యాత్ర, బహిరంగ సభలకు వచ్చిన ప్రజాదరణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు వైఎస్ జగన్. సజ్జల రామకృష్ణారెడ్డి, వీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. వంటి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఇందులో పాల్గొంటారు. బస్సు యాత్ర తరువాత పార్టీ గెలుపు అవకాశాలపై వైఎస్ జగన్ వారితో చర్చిస్తారు.

ప్రజల నుంచి అందిన వినతిపత్రాలు, వారి అభ్యర్థనలు, విజ్ఞప్తుల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వాటన్నింటినీ క్రోడీకరించి.. ఎలాంటి కొత్త పథకాలు, హామీలు ఇవ్వాలనే విషయం కసరత్తు సాగిస్తారు జగన్. ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉన్నందున అందులో చేర్చే అంశాలపై పార్టీ నాయకులతో జగన్ చర్చిస్తారు.
రాష్ట్రంలో సొంతంగా టిప్పర్, లారీలు ఉన్న డ్రైవర్లందరికీ కూడా వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి అయ్యే ఖర్చు, ఇతర అంశాలన్నింటినీ జగన్ సమీక్షించే అవకాశం ఉంది. ఇలాంటి పథకాలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications