అందుకే సీఎం జగన్ కు అంత క్రేజ్ - తండ్రిని మించి పోయేలా..!!
ముఖ్యమంత్రి పెద్ద మనసు చాటుకుంటున్నారు. పేదల వైద్యం విషయంలో తన తండ్రిని మించిపోయారు. చిన్నారుల గుండె చప్పుడు అవుతున్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి చిన్నారుల గుండె జబ్బుల చికిత్సకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు అందుకుంటోంది. జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పలువురు చిన్నారుల ఆయువు పెంచుతున్నారు. తాజాగా.. ఒక చిన్నారి గుండె మార్పిడి కోసం విశాఖ నుంచి తిరుపతి వరకు గుండె తరలింపును ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతీ క్షణం పర్యవేక్షించింది. ఆపరేషన్ పూర్తయ్యే వరకూ బాధ్యత తీసుకుంది. సంక్షేమంతో పాటుగా మనసులో నిలిచి పోయే నిర్ణయాలకే ఇప్పుడు జగన్ కు అంత క్రేజ్ తెచ్చి పెడుతున్నాయి.

సంజీవనిలా మారిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్
చిన్నారుల్లో వచ్చే గుండె జబ్బులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా.. జగన్ ఆదేశాల మేరకు నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయించారు. 2021 అక్టోబర్ 11న సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసి.. వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రి గుండె సమస్యలతో బాధ పడుతున్న ఎంతో మంది చిన్నారులకు సంజీవనిగా మారింది.

ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను నిలబెడుతూ..
రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఉచితంగా చిన్నారుల గుండె సంబంధిత సమస్యలకు నిపుణల సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన చిన్నారుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరింస్తుందనేది స్పష్టం చేస్తోంది. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రైతుకూలీ నెలరోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న తన 15 ఏళ్ల కుమారుడిని శ్రీపద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు అతని గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించి మార్పిడి అనివార్యమని తేల్చిచెప్పారు. జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి చికిత్స అందిస్తూ వస్తున్నారు. వారం క్రితం ఆ బాలుడి పరిస్థితి మరింత విషమించింది. ఈ సమయంలోనే విశాఖకు చెందిన ఓ మహిళకు బ్రెయిన్ డెడ్ కావటంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో ఆమె గుండెను ఈనెల 20వ తేదీన ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకొచ్చి గుండెజబ్బుతో బాధపడుతున్న 15ఏళ్ల బాలుడికి ఆరోగ్యశ్రీ కింద శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స చేసి అమర్చారు.

ప్రతీ క్షణం మానిటర్ చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం
విశాఖ మహిళ గుండె తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి అమర్చే అవకాశముందన్న సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రెండు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, వైద్యులను అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో గుండెను తరలించేందుకు ఏర్పాట్లుచేసింది. తిరుపతి నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన బృందం విశాఖకు వెళ్లి సన్యాసమ్మ గుండెను వేరుచేసి ప్రత్యేక బాక్సులో భద్రపరిచారు. దాన్ని శరవేగంగా తిరుపతి తరలించేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి బాక్స్‌ను టీటీడీ అంబులెన్స్‌లో 21.5 కి.మీ. దూరాన్ని 21 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు తీసుకొచ్చారు. ఒక నిమిషంలోనే ఆస్పత్రిలోకి గుండెను చేర్చారు. ఆరుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం 4.15 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పారు.