ప్రత్తిపాడులో బాలసాని వద్దంటున్న ఆ సామాజికవర్గం నేతలు.. వైసీపీ వార్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈసారి ఎన్నికల్లో విజయం సాధించే వారిని నియోజకవర్గాల ఇన్చార్జిలుగా నియమించాలని భావించిన జగన్మోహన్ రెడ్డి ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన బాలసాని కిరణ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
ఇక ఇదే అక్కడ వైసీపీలో కుల కుంపట్లు రేపి వైయస్ జగన్ కు తలనొప్పిగా మారిందన్న చర్చ జరుగుతుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గమైన ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ సాధించింది . మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర హోం మంత్రిగా కూడా పనిచేసి కీలకంగా వ్యవహరించారు.

రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో మేకతోటి సుచరితను మంత్రివర్గం నుంచి తప్పించారు. ఇక తాజాగా ఆమెకు తాడికొండ నుండి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో మేకతోటి సుచరిత వెంట ఉన్న మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గానికి చెందిన బాలసాని కిరణ్ కుమార్ కు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధితులు అప్పగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
గతంలో మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం చేసి, మాలల హక్కులు కాల రాయాలని చూశారని కూడా బాలసాని పై మాలలు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను మాల సామాజిక వర్గం నాయకులు చనిపోతే కనీసం బాలసాని పట్టించుకోలేదని, మాదిగ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించారు అని ఆయన వివక్షతో వ్యవహరిస్తున్నారని మాల సామాజిక వర్గ నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నారు.

నియోజకవర్గంలో 45 వేల సంఖ్యలో మాల ఓటర్లు ఉండగా, 27 వేల ఓట్లు ఉన్న మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం సరికాదు అన్న చర్చ కూడా ఈ సమయంలో జరుగుతుంది. ఈ క్రమంలో బాలసానికి మాల సామాజిక వర్గం సహకరించే అవకాశం లేదు. ఈ క్రమంలోనే వారు పార్టీ అధిష్టానానికి బాలసాని స్థానంలో వేరే వారికి టికెట్ కేటాయించాలని డిమాండ్ వినిపించాలని భావిస్తున్నారు.
లేదంటే బాలసానికి దూరంగా ఉండాలని కూడా భావిస్తున్నారు. ఇక ఈ పరిణామాలు వైయస్ జగన్ కు ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. మరి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రత్తిపాడులో బాలసానికి తగులుతున్న నిరసన సెగ నేపధ్యంలో అధిష్టానం పునరాలోచిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications