
పయ్యావుల ప్లాన్ సక్సెస్-ఫలిస్తున్న లెక్కల దాడి-టీడీపీకి కొత్త ఊపిరి
టీడీపీలో సీనియర్ ఎమ్మెల్యేగా, లెక్కల మాస్టారుగా పేరున్న పయ్యావుల కేశవ్ వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా అంత క్రియాశీలకంగా కనిపించలేదు. ఓ దశలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయిస్తారన్న ప్రచారాలు కూడా జరిగాయి. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ ఛైర్మన్ పదవి అప్పగించినా కేశవ్ మాత్రం యాక్టివ్ కాలేదు. దీంతో వచ్చే ఎన్నికల వరకూ ఇదే పరిస్ధితి కొనసాగుతుందని భావించిన వారికి పయ్యావుల షాకిచ్చారు. అనూహ్యంగా ఏపీ సర్కార్ పై ఎదురుదాడి మొదలుపెట్టారు. అదీ రాజకీయ విమర్శలతో కాకుండా లెక్కలతో, అది కూడా వైసీపీ సర్కార్ బలహీనతను గుర్తించి దానిపైనే దాడి చేస్తున్నారు.

జూలు విదుల్చుతున్న పయ్యావుల
రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ నుంచి గెలిచిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల్లో పయ్యావుల కేశవ్ కూడా ఒకరు. ఏ విషయమైనా అధ్యయనం చేయకుండా మాట్లాడరన్న పేరున్న పయ్యావుల.. మరోసారి వైసీపీ ప్రభుత్వంపై జూలు విదుల్చుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు చుక్కలు చూపించిన పయ్యావుల ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని అంకెలతో టార్గెట్ చేస్తున్నారు. పీఏసీ ఛైర్మన్ హోదాలో ఏపీ ఆర్ధిక శాఖలో జరుగుతున్న అవకతవకలపై ఆయన చేస్తున్న విమర్శలు వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా తాకుతున్నాయి.

అంకెలతో పయ్యావుల అటాక్
ప్రభుత్వం ఏదైనా విపక్షాలు చేసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. అందుకే గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ అసెంబ్లీలో ఈ లెక్కలతోనే అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, అక్బరుద్దీన్ ఓవైసీ, సురేష్ రెడ్డి వంటి నేతలు వీటి ఆధారంగానే విమర్శలు చేస్తూ ప్రత్యర్ధుల్ని ఇరుకునపెట్టేవారు ఇప్పుడు సరిగ్గా పయ్యావుల కేశవ్ కూడా అదే బాట ఎంచుకున్నారు. ఏపీ ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో అప్పులు, రుణాల సర్దుబాట్లతో నెట్టుకొస్తున్న వైసీపీ సర్కార్ ను పయ్యావుల కేశవ్ పీఏసీ ఛైర్మన్ హోదాలో అంకెలతో ఇరుకునపెడుతున్నారు.

జగన్ సర్కార్ బలహీనతపై దాడి
వైసీపీ ప్రభుత్వంలో నానాటికీ దిగజారుతున్న ఆర్ధిక పరిస్దితిపై విమర్శలకు సమాధానం చెప్పేందుకు సర్కార్ పెద్దలు ముందుకు రావడంలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎదురుదాడికే ప్రాధాన్యమిస్తున్నారు. దీన్ని గమనించిన పయ్యావుల అంకెలను ముందుపెట్టి వైసీపీ సర్కార్ బలహీనతపై దాడికి దిగుతున్నారు.
దీంతో వీటికి సమాధానం చెప్పకపోతే ప్రజల్లో పలుచన అయ్యే పరిస్ధితి అధికార పక్షానికి ఎదురవుతోంది. ముఖ్యంగా రోజువారీ ఆర్ధిక వ్యవహారాల్లో చేస్తున్న సర్దుబాట్లను టార్గెట్ చేస్తూ పయ్యావుల అటాక్ కొనసాగుతోంది. దీంతో వీటిపై వైసీపీ దగ్గరా సమాధానం లేకుండా పోతోంది. తాజాగా పయ్యావుల విమర్శలపై స్పందించిన ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రభుత్వాన్ని అడిగితే వివరాలు ఇస్తామన్నారు. దీంతో ఆ వివరాలు ఇవ్వాలని పయ్యావుల వెంటనే ఆర్ధికశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది.

టీడీపీకి ఊపిరిపోస్తున్న పయ్యావుల
2019 ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత రాష్ట్రంలో వైసీపీని టార్గెట్ చేసే పరిస్ధితి టీడీపీకి లేకుండా పోయింది. భారీ స్ధాయిలో ఎమ్మెల్యేలు గెలుపొండటం, అసెంబ్లీ, పార్లమెంటులో వైసీపీ హవా కొనసాగుతుండటంతో తెలుగు తమ్ముళ్లకు అవకాశం చిక్కడం లేదు. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు కూడా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడలేని పరిస్ధితి.
ఇలాంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ దూకుడుగా ముందుకెళ్తూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్టుండటం టీడీపీకి కొత్త ఊపిరిలూదుతోంది. ముఖ్యంగా మరో మూడేళ్లు పార్టీని వీడకుండా నేతల్లో ధైర్యం నింపేందుకు పయ్యావుల దూకుడు కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది.