andhra pradesh amaravati ys jagan nimmagadda ramesh kumar ap local body elections ap news ap govt అమరావతి
నిమ్మగడ్డకు క్లైమాక్స్‌లో మరో షాక్- ఎస్‌ఈసీ భేటీకి అధికారుల గైర్హాజరు- మోమో ఇచ్చినా
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుకోవడంలో విఫలమైన వైసీపీ సర్కారు ఆయనకు సహకరించేందుకు సిద్ధమైనట్లు కనిపించినా చివరి నిమిషంలో షాక్ ఇచ్చింది. రేపు పంచాయతీ రాజ్ ఎన్నికల తొలి విడత నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీ కోసం చేస్తున్న ఏర్పాట్లపై చర్చించేందుకు హాజరుకావాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులను కోరారు. అయితే అధికారులు మాత్రం హాజరుకాలేదు.
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఉదయం 10 గంటలకు రావాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‌తో పాటు ఇతర అధికారులకూ ఎస్‌ఈసీ సమాచారం పంపారు. అయితే సీఎం జగన్‌తో సమావేశం ఉన్నందున రాలేమని వారు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని మరో సమాచారం పంపారు. అయినా వారు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసారి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కమిషనర్ గిరిజాశంకర్ కు మెమో పంపారు. సాయంత్రం ఐదు గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలని అందులో సూచించారు. అయినా ఫలితం లేదు.

సాయంత్రం ఐదు గంటలకు కచ్చితంగా హాజరుకావాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ జారీ చేసిన మెమోను కూడా అధికారులు లెక్కచేయలేదు. ఎస్‌ఈసీతో భేటీకి రాలేమని, తమ తరఫున రాతపూర్వకంగా సమాధానం ఇస్తామని ఎస్‌ఈసీ కార్యాలయానికి సమాచారం పంపారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరిగే ప్రాంతాలను ఖరారు చేసేందుకు పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు హాజరు కాకపోవడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ చర్యలపై నిమ్మగడ్డ తదుపరి నిర్ణయం ఏంటన్నది ఇంకా తేలలేదు.