వ్యవసాయం అంటే తెలుసా?: జగన్‌కు కౌంటర్ ఇచ్చిన పరకాల, శ్రమపడ్డారని..
హైదరాబాద్: రైతు రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి అసలు వ్యవసాయం అంటే, వ్యవసాయ రుణం తెలుసా? అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వీడియో క్లిప్పింగ్‌లు సాధించి జగన్మోహన్ రెడ్డి బాగా శ్రమించారని పరకాల ప్రభాకర్ ఎద్దేవా చేశారు. వ్యవసాయ రుణాలు అంటే బ్యాంకు పరిభాషలో పంటరుణమే అంటారని చెప్పారు. వ్యవసాయం చేసి రైతులు నష్టపోతే ఆ మొత్తాన్ని ప్రభుత్వాలు చెల్లిస్తాయని చెప్పారు.
వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను బ్యాంకు రుణాలపై కొనుగులు చేస్తే వాటిని ప్రభుత్వం చెల్లించదని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన రైతుల పక్షాన ఉంటారో.. లేక ఎవరి పక్షానో ఉంటారో తేల్చుకోవాలని అన్నారు.

ఏపిలో మొత్తం 32లక్షల రైతు కుటుంబాలున్నాయని పరకాల ప్రభాకర్ చెప్పారు. ఏ రంగంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని జగన్‌కు ఆయన సూచించారు. శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాతనే ప్రభుత్వం రుణాలను మాఫీ చేస్తోందని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రుణాలు 87వేల కోట్లున్నాయని, కోటి మంది రైతులు రుణాలు తీసుకున్నారని అంటున్నారని.. అయితే వారందరూ ఎక్కడి నుంచి వచ్చారని పరకాల ప్రశ్నించారు. ఏ రైతు ఇంటి ముందుకు బ్యాంకు అధికారుల జీపు ఆగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పరకాల ప్రభాకర్ చెప్పారు.












Click it and Unblock the Notifications