పాలమూరు ఎత్తిపోతలపై చంద్రబాబు నో కామెట్, పట్టిసీమపైనే...
ఏలూరు: తెలంగాణ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదిపై తలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరాకరించారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఇటీవల ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నటువంటి విషయం తెలిసిందే.
ఆగస్టు 15 నాటికి పట్టిసీమ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చంద్రబాబునాయుడు తెలిపారు. ఆగస్టులోనే ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత ఆయన గురువారంనాడు మాట్లాడారు. పోలవరం పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
కుడి కాలువకు అవసరమైన భూములను సేకరిస్తామని, రైతులకు మంచి పరిహారం అందజేస్తామని చంద్రబాబు అన్నారు. పట్టిసీమను అడ్డుకునేందుకు చాలా మంది ప్రయత్నించారన్నారు. పట్టిసీమ వల్ల ముంపు సమస్య తప్పుతుందని చంద్రబాబు చెప్పారు.

పనుల వేగవంతానికి కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విమర్శలు చేసినవారికి పట్టిసీమతోనే సమాధానం చెబుతామని చంద్రబాబు అన్నారు. పట్టిసీమను పనులను చేపట్టిన ఉత్సాహంతోనే పోలవరం ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు కాంట్రాక్టర్ల వ్యవస్థను భ్రష్టు పట్టించాయని ఆయన విమర్శిచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో చంద్రబాబు ఏరియల్‌సర్వే నిర్వహించారు.












Click it and Unblock the Notifications