చంద్రబాబుతో పవన్, బీజేపీ మైండ్ గేమ్ - నవ్ ఆర్ నెవర్, తగ్గాల్సిందేనా...!!
40 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీలను కలిపి ఫ్రంట్ కన్వీనర్ గా నడిపించిన అనుభవం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం దక్కించుకోవటం టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇందుకోసం పవన్..బీజేపీని కలుపుకొని వెళ్లాలని భావించారు. చంద్రబాబు అవసరాన్ని ఆ రెండు పార్టీలు అవకాశంగా మలచుకుంటున్నాయి. మైండ్ గేమ్ మొదలు పెట్టాయి. ఒంటరిగా వెళ్లే సాహసం చేయలేని స్థితిలో చంద్రబాబు. అసలు ఏం జరుగుతోంది.
పొత్తుల వేళ కొత్త లెక్కలు : 2014 తరహాలో మూడు పార్టీల పొత్తులతో మందుకెళ్లి..2014 ఫలితాలు రిపీట్ చేసి అధికారంలోకి రావాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం. ఇందులో కొంత వరకు అడుగులు వేగంగా పడ్డాయి. జనసేనాని పవన్ సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు కోరుకున్నట్లుగా వైసీపీ మీద దూకుడుగా ఉన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకండా పొత్తులు అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు.
బీజేపీ కలిసే వచ్చేలా చేస్తామని ప్రకటించారు. అందుకోసం పవన్ ప్రయత్నాలు చేసారు. ఒక సమయంలో చంద్రబాబును సీఎం చేయటం కోసం తాను సీఎం రేసు నుంచి తప్పుకుంటున్నట్లుగా చెప్పి..టీడీపీ క్యాంపు లో ఆశలు పెంచారు. అటు బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశంతో ఇక వైసీపీని ఓడించటం ఖాయం..అధికారం మనదే అని టీడీపీ నేతలు భావించారు. అక్కడే కథ మలుపు తిరిగింది.

వ్యూహం మార్చిన పవన్ కల్యాణ్ : బీజేపీతో పొత్తు పైన ఆ పార్టీ నుంచి స్పష్ఠత లేదు. బీజేపీ ముఖ్యులు ఇంకా జగన్ కు మద్దతుగానే ఉన్నారనేది టీడీపీ అనుమానం. తమతో పాత్తు పెట్టుకున్నా..పూర్తిగా తమతోనే ఉంటారనే నమ్మకం టీడీపీలో కనిపించటం లేదు. పలితంగా ఢిల్లీ చర్చలు..పొత్తులపైన ఒక్క ప్రకటన చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించిన అమిత్ షా..చర్యలు తీసుకోవాలంటూ హోం మంత్రిని ఫిక్స్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.
దీని ద్వారా బీజేపీకి దగ్గరవ్వడం సందేహంగానే కనిపిస్తోంది. నమ్మకం పెట్టుకున్న పవన్ కల్యాణ్ తీరులోనూ అనూహ్య మార్పు కనిపిస్తోంది. సీఎం తానే అవుతానంటూ వారాహి యాత్రలో పవన్ ప్రచారం చేసుకుంటున్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్ధిస్తున్నారు.
టీడీపీ అధినేత అంగీకరిస్తారా : దీని ద్వారా తాను సీఎం కావాలని కోరుకుంటున్న అభిమానుల్లో జోష్ పెంచేందుకే అని చెబుతున్నా..ఎన్నికల వేళ చంద్రబాబు సీఎం అని చెబితే పవన్ ఎక్కడైతే ఆశలు పెట్టుకున్నారో..అక్కడే పునాదులతో సహా దెబ్బతినే ప్రమాదం ఉందనే వాదన ఉంది. ఇదే సమయంలో తన అవసరం టీడీపీకి ఎంత ఉందో తెలిసిన పవన్..ఎన్నికల వేళ తన వాళ్లకు సీట్లు..పవర్ షేరింగ్ పైన పట్టు బిగించేందుకే ఇప్పుడు తన సీఎం అభ్యర్ధిత్వం..అధికారం పైన ప్రచారం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

పొత్తుల ఊసెత్తకుండా టీడీపీ పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారనేది మరో వాదన. జనసేనతో పాటుగా బీజేపీ కలిసి వస్తే వారు కోరినట్లుగా సీట్లు కేటాయిస్తే..టీడీపీకి మొత్తానికే నష్టం జరిగే అవకాశం ఉందని తెలుగుదేశం నేతల ఆందోళన.
చంద్రబాబు నిర్ణయాలపై ఉత్కంఠ : రానున్న ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ అని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసారు. దీంతో, ఎవరినీ దూరం చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో వారి డిమాండ్లు అంగీకరిస్తే ఏం జరుగుతందనే ఉత్కంఠ ఏర్పడుతోంది. ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తామని టీడీపీ నేతలు చెబుతున్నా..ఆ సాహసానికి చంద్రబాబు సిద్దంగా లేరని స్పష్టంగా అర్దం అవుతోంది. ఈ సమయంలో ఇప్పుడు బీజేపీ, పవన్ కల్యాణ్ మైండ్ గేమ్ కు చంద్రబాబు తగ్గి..వారి డిమాండ్లకు అంగీకారం తెలుపుతారా.. లేక, ఈ పొత్తుల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటాయా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications