తానేటి వనిత, జక్కంపూడి రాజాపై జనసేన అభ్యర్థులు వీరే..!!
అమరావతి: ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనితోపాటు లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోనుంది రాష్ట్రం. దీని కోసం అన్ని పార్టీలు సమయాత్తమౌతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన.. ఎన్నికల దిశగా కసరత్తు సాగిస్తోన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్- వై నాట్ 175 నినాదంతో దూసుకెళ్తోన్నారు.
Recommended Video

యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తోన్నారు. వారాహి బస్సు యాత్ర ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మకాం వేశారు. కాపు సామాజిక వర్గ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండే జిల్లాలు కావడం వల్ల రాజకీయంగా ఆయన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

అటు బీజేపీ సైతం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్రశాఖలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. మొన్నటివరకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించింది. ఆ స్థానంలో కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని కూర్చోబెట్టింది. మొన్నామధ్యే బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గ కమిటీలో చోటు కల్పించింది.
ఈ క్రమంలో జనసేన పార్టీ మరో అడుగు ముందుకేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ ముగ్గురూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టే

ఆ మూడు నియోజకవర్గాలు- పిఠాపురం, రాజానగరం, కొవ్వూరు. పిఠాపురానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా బత్తుల బలరామకృష్ణ అపాయింట్ అయ్యారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కొవ్వూరు ఇన్‌ఛార్జీ బాధ్యతలను మాజీ శాసన సభ్యుడు టీవీ రామారావుకు అప్పగించారు.
ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండా పాతిన విషయం తెలిసిందే. 2019 నాటి ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండెం దొరబాబు ఘన విజయం సాధించారు. టీడీపీకి చెందిన ఎస్వీఎస్ఎన్ వర్మను ఓడించారాయన. రాజానగరానికి జక్కంపూడి రాజా ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.

కొవ్వూరు- హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి చెందిన వంగలపూడి అనితను ఏకంగా పాతిక వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు. ఇక ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. టీవీ రామారావు గతంలో టీడీపీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications