తెలుగు రాష్ట్రాల్లో బలోపేతమే: పవన్ కళ్యాణ్ పార్టీపై అభిమాన సేన
నెల్లూరు: తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ 'జనసేన' బలోపేతానికి ఆయన అభిమానులు నడుంబిగిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు వారంతా కంకణం కట్టుకున్నట్లు చెబుతున్నారు.
ఈ మేరకు నెల్లూరులో సోమవారం జరిగిన పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం సర్వసభ్య సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన సంఘం నేతలు ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు టోనీబాబు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

పార్టీలకు అతీతంగా జనసేన తరపున ప్రజా సమస్యలపై పోరు సాగించేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులంతా ముందుకు రావాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో భారీ రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు వీళు దొరికినప్పుడల్లా ఆయన ప్రజా సమస్యలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ అభివృద్ధిపై ఆయన దృష్టి సారించనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి విధితమే.












Click it and Unblock the Notifications