
మత్స్యకారుల కోసం జనసేనాని పోరాటం; ఫిబ్రవరి 20న పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకారుల కోసం రంగంలోకి దిగనున్నారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్నా 217 జీవోపై గళం ఎత్తడానికి మత్స్యకార అభ్యున్నతి సభను నిర్వహించాలని నిర్ణయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తారని, మత్స్యకారులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తేల్చి చెప్పారు.

మత్స్యకారుల పక్షాన జనసేనాని పోరాటం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపల చెరువులపై మత్స్యకారుల అధికారులు తొలగించేలా వారి ఉపాధికి దెబ్బతీసేలా 217 జీవోను జారీ చేసింది . మత్స్యకార సొసైటీల పేరుతో చేపల చెరువులన్నీ దళారీల చేతిలో ఉన్నాయని అందుకే 217 జీవో ద్వారా వేలం వేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనిపై మత్స్యకారుల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో మత్స్యకారులకు నష్టం చేసేదిగా ఉందని, వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని మత్స్యకారుల నుండి డిమాండ్ వినిపిస్తోంది. కేవలం వైసీపీ నాయకులకు చేపల చెరువులను కట్టబెట్టడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మత్స్యకారుల పక్షాన పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు.
ఫిబ్రవరి 20న నరసాపురంలో 'మత్సకార అభ్యున్నతి సభ'
ఫిబ్రవరి 20వ తేదీన నరసాపురంలో 'మత్సకార అభ్యున్నతి సభ' నిర్వహించాలని జనసేన పార్టీఅధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందింప చేయడం, వృత్తిపరమైన ఉపాధి భరోసా కల్పించడం, ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న మత్స్యకారుల డిమాండ్ల సాధన కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు మత్స్యకారుల సమస్యలపై దృష్టిపెట్టే సమయం, ఆలోచన రెండూ లేని నేపథ్యంలో మత్స్యకారుల పక్షాన పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్న ట్లుగా జనసేన పార్టీ వెల్లడించింది.

ఫిబ్రవరి 13, 14 తేదీల్లో జనసేన 'మత్స్యకార అభ్యున్నతి యాత్ర'
ముఖ్యంగా మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా ఉన్న 217 జి.ఓ.పై పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించాలని సంకల్పించారని పేర్కొంది. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ పర్యవేక్షణలో సభ సాగుతుందని జనసేన పార్టీ వెల్లడించింది. మత్స్యకార సమస్యలపై పోరాటంలో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన జనసేన నాయకులు, శ్రేణులు, వీర మహిళలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని మత్స్యకార గ్రామాలలో 'మత్స్యకార అభ్యున్నతి యాత్ర' చేపడతారు.

రెండు రోజుల యాత్రలో మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం .. పవన్ కు నివేదిక
13వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేట నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారు. 13, 14 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ యాత్రలో నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు. యాత్రలో పార్టీ మత్స్యకార వికాస విభాగం క్షేత్ర స్థాయిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను అధ్యయనం చేస్తుంది. ఇందుకు సంబంధించిన నివేదికను వికాస విభాగం ఛైర్మన్ నాయకర్, ఇతర సభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందచేస్తారు.
Recommended Video

20న నరసాపురంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
రెండు రోజుల క్షేత్రస్థాయి పర్యటనలో మత్స్యకార సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత20న నరసాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహిస్తారు. మత్స్యకార అభ్యున్నతి సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో మత్స్యకారుల సమస్యల పరిష్కారంపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రానున్నారని సమాచారం. 217 జి.ఓ రద్దు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యనున్నారని సమాచారం.