జగన్ లేఖ రాస్తే జడ్జీలే బదిలీ.. రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ అంటారా ? మీ అత్యుత్సాహం ఏమైంది : పవన్ కళ్యాణ్ ఫైర్
రామతీర్థం ఆలయంలో కోదండరాముని విగ్రహం ధ్వంసమైన వ్యవహారంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా ఆలయాల చుట్టూ తిరుగుతోంది . వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆలయాలపై దాడులు యదేచ్ఛగా కొనసాగుతున్నాయని , విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు గతంలో ఎన్నడూ లేనివిధంగా మతపరమైన విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చోటుచేసుకున్నాయి.
పవన్ కరివేపాకు , బండి సంజయ్ లో లెవల్ .. చంద్రబాబువి పగటి కలలు : కేఏ పాల్ సంచలనం

సీఎం స్థాయిలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్షాలపై విమర్శలా ?
తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో వందకు పైగా ఆలయాలపై దాడులు జరిగాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేస్తున్నారని, ఇది కరెక్టేనా అని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే, నోటికొచ్చింది మాట్లాడితే ప్రజలు హర్షించరని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు .

జడ్జీలపై పవన్ అనుచిత వ్య్తాఖ్యలు .. రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ అన్న జగన్ పై ఫైర్
రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడుస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకునేలా ఉందన్నారు. ఆయన స్థాయికి తగిన మాటలు కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మీరు ఎంతటి శక్తివంతులో అందరికీ తెలుసు అని పేర్కొన్న పవన్ కళ్యాణ్, మీరు ఒక లేఖ రాస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ,న్యాయమూర్తులు క్షణాల్లో బదిలీ అయిపోతారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్ ఫేర్ చేయడానికి ఎవరు సహకరిస్తారు అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలలో జడ్జీల ప్రస్తావన తీసుకురావటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది .

151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు.. వేలాది పోలీస్ సిబ్బంది .. పట్టుకోలేరా ?
151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ,115 మంది ఐపీఎస్ లు ,115 మంది అదనపు ఎస్పీలు ,వేలాది మంది పోలీసు సిబ్బంది ఇలా ఉండగా విగ్రహాల ధ్వంసం చేసిన వారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్ గారి పైన, సోషల్ మీడియాలో మీ పైన మీ పార్టీ వారి పైన పోస్టులు పెట్టిన వారిపై అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

మీ వాలంటీర్లు సమాచారం ఇవ్వటం లేదా ? పీఠాధిపతులు రోడ్డు మీదకు వస్తున్నారు
ఊరికో వాలంటీర్ చొప్పున రెండు లక్షల అరవై వేల మందిని నియమించారు కదా.. వారు కూడా సమాచారం ఇవ్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. లోపం ఎక్కడ ఉంది ? మీ లోనా ? మీ నీడలో ఉన్న వ్యవస్థ లోనా? అంటూ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలు అన్నింటినీ ఒకే గాటన కట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మీరు చెప్పడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు గా ఉందని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది అన్నారు పవన్ కళ్యాణ్. ఇకనైనా ఇటువంటి మాటలు కట్టిపెట్టి దోషులను పట్టుకొని వారిని ప్రజల ముందు నిలబెట్టే పనిలో ఉంటే మంచిది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.