ఢిల్లీ గడప తొక్కేదే లేదని భీష్మించిన పవన్ కల్యాణ్? సందిగ్ధంలో చంద్రబాబు!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు భారతీయ జనతాపార్టీతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారు. జనసేన కూడా కలిసి వస్తుందనే నమ్మకం ఆయనలో ఉంది. అందుకు తగ్గ సంకేతాలు ఇరుపార్టీల మధ్య దోబూచులాడాయి. అయితే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వైఖరి ఇప్పుడు సందేహాస్పదంగా మారింది. రాజకీయ పరిణామాలన్నీ విశ్లేషిస్తుంటే ఢిల్లీలోని కేంద్ర నాయకత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే ధోరణిలో ఆయన ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కలిసే ప్రయత్నం కూడా చేయలేదు
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కు కూడా ఆహ్వానం అందింది. కానీ ఆయన హాజరు కాలేదు. ప్రధానమంత్రి భీమవరం పర్యటనలో పాల్గొన్నప్పుడుకానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గోదావరి గర్జన కార్యక్రమానికి వచ్చినప్పుడుకానీ ఒంట్లో నలతగా ఉందని ఆయా కార్యక్రమాలకు డుమ్మా కొట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో రెండురోజులపాటు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు అమిత్ షా, జేపీ నడ్డా తదితర నేతలంతా అక్కడే ఉన్నప్పటికీ మిత్రపక్షంగా పవన్ వారిని కలిసే ప్రయత్నమే చేయలేదు.

పవన్ లేకుండానే బీజేపీ పాదయాత్ర
పవన్ దృష్టి మొత్తం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంపైనే ఉంది. కేంద్ర పెద్దలు జనసేనానిని దూరంగా పెట్టారా? లేదంటే పవన్‌కల్యాణే ఢిల్లీ పెద్దలను వద్దనుకుంటున్నారా? అనే విషయంలో స్పష్టత రావడంలేదు. దీనికి కారణాలేమై ఉంటాయనే చర్చ ప్రస్తుతం జనసేనలో జరుగుతోంది.
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. వాస్తవానికి అమరావతి రాజధానిగా ఉండాలనే లక్ష్యంతో బీజేపీతో కలిసి రాజధాని పరిధిలో పాదయాత్ర చేయాలని పవన్ నిర్ణయించారు. కానీ ఆయన లేకుండా, ఆ పార్టీ లేకుండా బీజేపీ నేతలే సొంతంగా అమరావతిలో పాదయాత్ర నిర్వహించి తాము గ్రహించిన విషయాలను అధిష్టానానికి తెలియజేశారు.

చంద్రబాబు అలా.. పవన్ ఇలా..
రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లాలనుకుంటున్న చంద్రబాబు బీజేపీతో కలిసి వెళ్లాలనుకుంటున్నారు. టీడీపీతో కలిసి వెళదామనుకుంటున్న జనసేన మాత్రం బీజేపీకి దూరం జరుగుతోంది. కరోనా వల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందని, అది తగ్గగానే తమ మధ్య దూరం కూడా తగ్గిపోతుందని పవన్ స్వయంగా ప్రకటించారు. కేంద్రానికి చంద్రబాబు దగ్గరవుదామనుకుంటుంటే పవన్‌కల్యాణ్ దూరం జరగాలనుకుంటున్నారు. మరి భవిష్యత్తులో ఇద్దరూ కలిసి బీజేపీతో కలిసి పయనం కొనసాగిస్తారా? లేదంటే ఎవరికి వారే యమునాతీరే అన్నరీతిలో ఉంటారా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications