
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో ఏపీ గంజాయికి లింక్; పవన్ కళ్యాణ్ టార్గెట్ జగన్ సర్కార్ .. వదిలేలా లేరుగా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు ఏపీ సర్కార్ కు తలనొప్పిగా మారుతుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే ఏపీ గంజాయి సాగుపై జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారా? దశాబ్దాల కాలంగా గంజాయి సాగు జరుగుతుందని చెబుతూనే వైసిపి హయాంలోనే గంజాయి విచ్చలవిడి దందా జరుగుతుందని ఆరోపిస్తున్నారా? ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో గంజాయి సాగును కట్టడి చేయడం కోసం పరివర్తన కార్యక్రమంతో జగన్ సర్కారు తంటాలు పడుతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

ఏపీ గంజాయి వ్యవహారాన్ని వదిలిపెట్టని పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ వదిలిపెట్టడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు వృద్ధి బాగా జరుగుతుందని పదే పదే జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో గంజాయి సాగు అధికంగా ఉందని కొన్ని ఏళ్లుగా జరుగుతున్నా వైసీపీ హయాంలోనే రెట్టింపు అయిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక గంజాయి సాగు ఎంతమేరకు పెరిగిందనేది పోలీసులు చెప్పాలని పేర్కొన్న పవన్ కళ్యాణ్ గంజాయి మొక్కను రాష్ట్ర చిహ్నంగా వైసిపి ప్రభుత్వం మార్చేసింది అంటూ మండిపడ్డారు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదే సమయంలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ముంబై క్రూయిజ్ షిప్ లో పక్కన కూర్చున్న వ్యక్తి దగ్గర 15 గ్రాముల డ్రగ్స్ దొరికితే, వాట్సప్ మెసేజ్ ఆధారాలతో అనుమానించి షారుక్ ఖాన్ కుమారుడిని 23 రోజులు జైల్లో పెట్టారని, అటువంటిది ఒక పంట కాలంలో దాదాపు నాలుగు వేల టన్నుల వరకు బయటకు వెళ్తుంటే ఎంత మంది నాయకులను ఎన్ని రోజులు జైల్లో పెట్టాలో చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై అనుమానాలున్నాయని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఏకంగా గంజాయి కలిపిన సారా అమ్ముతున్నారు అంటూ ఆరోపించారు.

వైసీపీ నాయకుల తీరుపై పవన్ కళ్యాణ్ అసహనం
వేల ఎకరాలలో గంజాయి సాగు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. వైసిపి నాయకులు మాట్లాడితే మేమే చేశామా తెలుగుదేశం హయాం నుండి సాగు అయ్యిందని చెబుతున్నారని, తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా తాను గంజాయి సాగు గురించి మాట్లాడానని, దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని చెప్పానని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా సమస్యను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గంజాయి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలోనే
ఇప్పటికే పదే పదే గంజాయి ఒక సామాజిక ఆర్థిక అంశమని పేర్కొంటున్న పవన్ కళ్యాణ్, ఏపీ సర్కార్ ను గంజాయి సాగు వ్యవహారంలో ఇరకాటంలో పెడుతున్నారు. దేశవ్యాప్తంగా గంజాయి ఎక్కడ దొరికినా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ గంజాయి దందాకు అడ్డాగా మారిందని పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల జరిగిన గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు.

గంజాయి సాగు బదులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని చెప్తున్న పవన్ కళ్యాణ్
గంజాయి సాగుకు అడ్డుకట్ట వేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించాలని, గంజాయి సాగు బదులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వారికి సూచించాలని పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా గంజాయి సాగును, రవాణాను నివారించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారులతో తెలిపారు గంజాయి స్మగ్లర్లు వారికి సహకరించే వారి వివరాలను సేకరించి, గంజాయి సాగు నియంత్రణ కోసం పని చేస్తామని వెల్లడించారు.