ఎవరికీ రుచించని పవన్: బాబుకు వత్తాసని వైసిపి, చిరు పేరు చెప్పి ఎంపీలు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు ఏ ఒక్క పార్టీకి కూడా రుచించినట్లు లేవు, పవన్ కళ్యాణ్‌పై ప్రధాన రాజకీయ పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. ఏడాదికో సినిమా అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, తెలంగాణ మంత్రి కెటి రామారావు సోమవారం వెంటనే వ్యాఖ్యానించగా, మంగళవారం తాజాగా ఆ పార్టీ ఎంపి, తదితురులు తీవ్రంగా ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మంగళవారం అనంతపురంలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ తీరును వారు మీడియా సమావేశంలో తప్పు పట్టారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం, బిజెపిలకు అనుకూలంగా ప్రచారం నిర్వహించి, సదరు పార్టీలు అధికారంలోకి వచ్చి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తాను వ్యతిరేకిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారని వారు గుర్తు చేశఆరు.
అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నోటుకు ఓటు వ్యవహారంలో చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కోట్లు దండుకోవడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని వారు మండిపడ్డారు. మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస రెడ్డి, నగర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు వెంకటచౌదరి పాల్గొన్నారు.

కాగా, తాము వ్యాపారంపైనే దృష్టి పెట్టామని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి కూడా కేంద్రంలో మంత్రిగా పనిచేశారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు పెట్టిన సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించాలని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ మాత్రమే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించినట్లు కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం తమకు కలిసి వస్తుందని వారు భావిస్తూ ఉండవచ్చు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పవన్ కళ్యాణ్ తప్పు పట్టడం కూడా వారికి ఆనందం కలిగించే విషయమే.












Click it and Unblock the Notifications