జనసేన రాజకీయానికి పవన్ కళ్యాణ్ విరామం?
హైదరాబాద్: జనసేన పార్టీ స్థాపన ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోకి దూసుకొచ్చిన టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ మౌనం వహించారు. రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేసి కాంగ్రెసును, పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఉతికిపారేశారు. ఆ తర్వాత ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై, వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన ఏమీ మాట్లాడడం లేదు.
విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన రెండో సభలో ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఓ ఉత్కంఠకు తెర దించారు. ఆ తర్వాత ఆయన బిజెపి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన ముందుకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మాత్రం ఆయన మద్దతు ప్రకటించారు. మోడీని కలిసి ఓ ఊపును తెచ్చుకున్నారు.

రాష్ట్ర విభజన తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విశాఖపట్నంలో విడుదల చేసిన తన ఇజం పుస్తకంలోని అంశాలపై దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ వంటివారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు అది అర్థం కాలేదని వర్మ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఇజంలో ఏ విధమైన సిద్ధాంతం లేదని అన్నయ్య చిరంజీవి కూడా వ్యాఖ్యానించారు.
హంగామాతో విడుదలైన సినిమాను జనసేన పార్టీ స్థాపన తలపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, తాను తప్పు చేసేవారిని నిలదీస్తానని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ 2019లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేనను స్థాపించినట్లు భావిస్తున్నారు. ఓ పార్టీ అంటూ ఏర్పడింది కాబట్టి ప్రస్తుత ఎన్నికలు ముగిసిన తర్వాత దాని నిర్మాణంపై దృష్టి పెడుతారని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల విషయంలో తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నారని అంటున్నారు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి పూర్తి స్థాయిలో జనసేనపై ఆయన దృష్టి పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications