సైనిక్ బోర్డుకు పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం, చెక్కు అందజేసిన జనసేనాని, సాయం చేయాలని పిలుపు
సైనిక్ బోర్డుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం అందజేశారు. గురువారం ఢిల్లీలోని సైనిక్ భవన్‌లో సైనిక అధికారులకు చెక్కు ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇదివరకు ఢిల్లీ వచ్చిన సమయంలో చెక్కు ఇవ్వాలనుకున్నానని, కానీ వీలుపడలేదని పేర్కొన్నారు. సైనిక్ బోర్డుకు విరాళం అందజేసేందుకే ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చానని పేర్కొన్నారు. రూ. కోటి విరాళం అందజేసిన పవన్ కల్యాణ్‌కు సైనిక్ బోర్డు ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

రెండునెలల క్రితం లేఖ..
సైనిక్ బోర్డుకు విరాళం ఇవ్వాలని డిసెంబర్‌లో బ్రిగేడియర్ విజేందర్ కుమార్ ప్రముఖులకు లేఖ రాశారు. అందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. సైనికులకు సాయం చేయాలని అందులో సూచించారని, అదీ తన మనసుకు బలంగా తాకిందని పవన్ తెలిపారు. వెంటనే రూ.కోటి అందజేస్తానని ప్రకటించానని గుర్తుచేశారు. విరాళం ఇవ్వడానికి ఇదివరకు రెండుసార్లు ఢిల్లీ వచ్చిన సమయంలో తీరిక లేకుండా పోయిందన్నారు. గురువారం ప్రత్యేకంగా అందుకోసమే హస్తిన వచ్చానని తెలిపారు.

సాయం చేయండి..
తనలాగా ఇతరులు కూడా స్పందించాలని పవన్ కల్యాణ్ కోరారు. మనం ఇచ్చే విరాళం సైనికుల కుటుంబాలకు, గాయపడ్డవారికి మేలు చేస్తోందని చెప్పారు. ప్రత్యేకంగా విరాళం ఇచ్చేందుకే ఢిల్లీ వచ్చానని.. రాజకీయ నేతలతో కలువచ్చు, కలవకపోవచ్చు అని నర్మగర్భంగా కామెంట్ చేశారు. సైనిక్ భవన్ నుంచి నేరుగా విజ్ఞాన్ భవన్‌కు పవన్ కల్యాణ్ వెళతారు.

సందేహాలు- సమాధానాలు
విజ్ఞాన్ భవన్‌లో ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. మేఘాలయ స్పీకర్ శ్రీ మెత్చా లింగ్లో అధ్యక్షతన సదస్సు జరగనుంది. దేశానికి స్వచ్చమైన యువ రాజకీయ నాయకత్వం అందించేందుకు సదస్సు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇస్తారు. అనంతరం పవన్ కల్యాణ్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా తదితరులు పాల్గొంటారు.












Click it and Unblock the Notifications