టీడీపీని నిలదీసిన పవన్-కులంతో ముడిపెట్టి మరీ..
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం కృష్ణా జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం పరిధిలో గల బాపులపాడు మండలం మల్లపల్లిని సందర్శించారు. మల్లపల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతులతో ఆయన సమావేశం అయ్యారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
2016లో చంద్రబాబు సారథ్యంలోని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మల్లపల్లి పారిశ్రామికవాడ కోసం రైతుల నుంచి భూములను సేకరించింది. వారికి నష్టపరిహారాన్ని చెల్లించలేదు. కొంతమంది రైతులకు మాత్రమే పరిహారాన్ని చెల్లించి చేతులు దులుపుకొంది అప్పటి టీడీపీ ప్రభుత్వం.

తమకు న్యాయం చేయాలని, నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ మల్లపల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతులు ఆందోళనలు చేస్తూనే వస్తోన్నారు గానీ ప్రభుత్వం బేఖాతరు చేసింది. దీనిపై పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. నిర్వాసిత రైతులను కలుసుకున్నారు. వారి ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఇక్కడి భూములను ప్రభుత్వం తీసుకుందని, ఇప్పటికీ వారికి పూర్తిస్థాయిలో పరిహారం దక్కట్లేదని అన్నారు. కొంతమందికే పరిహారం లభించిందని పేర్కొన్నారు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి తెలుగేదశం పార్టీనే ప్రధాన కారణమని, అప్పటి టీడీపీ ప్రభుత్వం విధానాల వల్లే సమస్య మొదలైందని పవన్ కల్యాణ్ చెప్పారు.
ఒక కులం వారికే టీడీపీ ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తే ఎలా?.. అంటూ పవన్ కల్యాణ్ నిలదీశారు. రైతులను కులాల వారీగా విభజించడం సరికాదని చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా ఒక కులం వారికే పరిహారం ఇస్తామనడాన్ని సమర్థించబోమని చెప్పారు. రైతుల్లో అన్ని కులాల వారు ఉంటారని చెప్పారు.
ఏ ఒక్క కులం వల్లో సమాజం నడవదని, టీడీపీ కూడా మల్లపల్లి రైతులకు అండగా ఉండాలని కోరుకుంటున్నానని పవన్ విజ్ఞప్తి చేశారు. వెయ్యి మందికి ఉపయోగపడుతుందనుకుంటే ప్రభుత్వం ఎవరి నుంచయినా భూమిని తీసుకోవచ్చని రాజ్యాంగం వివరించిందని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అదే రాజ్యాంగం పేర్కొందని చెప్పారు పవన్ కల్యాణ్.
మల్లపల్లిలో మాత్రం దీనికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. 2024లో ప్రభుత్వం మారబోతోందని, మల్లపల్లి రైతులకు న్యాయం జరిగేలా తాము పోరాడతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కన్నీరు పెట్టుకోవడం మంచిది కాదని పేర్కొన్నారు. మల్లపల్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications