పవన్ పర్యటన.. ప్రశ్నలెన్నో, సాధిస్తారా: అధికార పక్షమా, జగన్‌లా ప్రతిపక్షమా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపు (గురువారం నాడు) ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సామాన్యుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత శనివారం పవన్.. ఏపీ సీఎం చంద్రబాబును కలవడం, ఏపీకి కేంద్ర బడ్జెట్లో జరిగిన నష్టం గురించి చర్చించడంతోపాటు ఏపీ రాజధాని ప్రాంత రైతుల సమస్యల గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన సోమవారం నాడు రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతులతో మాట్లాడుతారని ప్రచారం జరిగింది. అయితే ఆ పర్యటన ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతు పలికిన పవన్.. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఏపీ, కేంద్ర ప్రభుత్వ పాలనలు మెచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు మాత్రం కేంద్ర బడ్జెట్ పైన అసంతృప్తితో ఉన్నారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని భావిస్తున్నారు.
అందుకే బయటకొచ్చారు
అదే సమయంలో రాజధాని ప్రాంతంలోని పలువురు రైతులు భూసమీకరణ పట్ల ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. తాను మద్దతిచ్చిన ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే.. వారు తప్పు చేస్తే నిలదీస్తానని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు ఆయన బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని, అలాగే రాజధాని ప్రాంత రైతుల అసంతృప్తి ఏమిటో తెలుసుకునేందుకు ఆయన బయటకి వచ్చారని చెప్పవచ్చు. తద్వారా తాను ప్రచార సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నారని అంటున్నారు.

ఊరట లభిస్తుందా?
అయితే, పవన్ పర్యటన ద్వారా రైతులకు ఊరట లభిస్తుందా? వారి సమస్యల్ని ఆయన ప్రభుత్వం దృష్టికి ఎంత వరకు తీసుకెళ్తారు? లేక విపక్షాలు అనుమానిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు మద్దతుగానే పర్యటన సాగుతుందా? రాజధాని కోసం రైతుల మద్దతు కూడగడ్తారా? రైతుల ఆగ్రహాన్ని చల్లార్చే మంత్రం పవన్ వద్ద ఉందా? రైతులు కోరుకుంటున్న న్యాయం ప్రభుత్వం నుండి చేపిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం వస్తుందని చాలామంది భావిస్తున్నారు.
అయితే, కొందరు మాత్రం ఈ పర్యటన రాజకీయపరమైనదిగా కొట్టి పారేస్తున్నారు. సమస్యల పైన ఇన్నాళ్లు పెదవి విప్పకుండా ఇప్పుడు విప్పితే ప్రజలు నమ్మరని కొందరు అంటుంటే.. బడ్జెట్లో అన్యాయం, రాజధాని రైతులకు తీవ్ర అసంతృప్తిని తీవ్రంగా పరిగణించినందువల్లనే ఆయన ప్రశ్నించేందుకు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారని మరికొందరు చెబుతున్నారు.
చంద్రబాబు, మోడీల దోస్తీ... మద్దతు: సాధిస్తారా?
సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీలతో పవన్ కళ్యాణ్ దోస్తీ బాగా పెరిగిందని చెప్పవచ్చు. పవన్ బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతివ్వడం వెనుక పలు రకాల ఊహాగానాలు ఉన్నాయి. ఇతర పార్టీల పైన వ్యతిరేకతతో.. ఆ పార్టీలు అధికారంలోకి రావొద్దనే ఉద్దేశ్యంతో ఈ కూటమికి మద్దతిచ్చారనే వాదన ఉంది. ఎందుకు మద్దతిచ్చారనే విషయాన్ని పక్కన పెడితే.. ఆ తర్వాత పవన్ బీజేపీ, టీడీపీలకు చాలా దగ్గరయ్యారు.
మోడీ, చంద్రబాబులు తాము అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా పవన్ పేరును పలవరించారు. ఏపీలో అధికారంలోకి రావడానికి పవన్ కూడా ఓ కారణమని వారితో పాటు బీజేపీ, టీడీపీ నేతలు కూడా చెప్పారు. మోడీ, చంద్రబాబులు ఆ తర్వాత పవన్‌కు ఇచ్చిన ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీనిపై ఆయన ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బయ్యారు కూడా. అయితే, దీని ద్వారా ఆయన ఏమేరకు సాధిస్తారనేది చూడాల్సి ఉందంటున్నారు.

రెండింటి కోసం రంగంలోకి దిగిన పవన్
పవన్ కళ్యాణ్ కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం, రాజధాని ప్రాంత రైతుల అసంతృప్తి.. ఈ రెండింటి విషయమై రంగంలోకి దిగారు. తొలుత రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడి.. వారి సమస్యలు తెలుసుకున్నాక.. వాటిని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి, అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకు పోవచ్చని భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఢిల్లీ పర్యటన కంటే ముందే రాజధాని ప్రాంత పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు.
వైయస్ జగన్ ప్రతిపక్షం.. పవన్ అధికార పక్షం! ఏం చేస్తారు?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఆయన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల భూములు తిరిగి ఇస్తామని చెప్పారు. అయితే, అది ప్రతిపక్ష నేత మాట అంటున్నారు. రాజధాని నిర్మాణానికి ఈ జూన్‌లో శంకుస్థాపన జరుగుతుంటే.. ఆ భూములను తిరిగి ఎలా ఇవ్వగలుగుతారనేది ప్రశ్నే అంటున్నారు.
ప్రతిపక్ష నేతగా ఆయన రాజకీయ వాగ్ధానాలు చేస్తున్నారనే వారు లేకపోలేదు. జగన్ అధికార పార్టీ ముందు పెట్టే డిమాండ్లు నెరవేరినా, నెరవేరకపోయినా ఆయన ప్రతిపక్ష నేత. కాబట్టి ఏమైనా చేయగలుగుతారని అంటున్నారు.
అయితే, పవన్ అధికార పక్షమని, రైతుల ఆవేదనను అర్థం చేసుకున్నాక.. ప్రభుత్వం ముందు ఉంచాక... వాటిని నెరవేర్చేలా చేసే బాధ్యత ఎక్కువవుతుందని అంటున్నారు. ప్రభుత్వానికి భిన్నంగా ఉంటే.. పవన్ ఏంచే స్తారు, నేరుగా బయటకు వచ్చి నిలదీస్తారా అనే చర్చ సాగుతోంది. ఏపీకి కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయం పైన.. చర్చించాక కూడా న్యాయం జరగకుంటే ఆయన.. ఇటు బాబు పైన, అటు మోడీ పైన పోరాటం కొనసాగిస్తారా? అనే చర్చ సాగుతోంది.

2019 పవన్ కళ్యాణ్ టార్గెట్!
పవన్ కళ్యాణ్ 2019 నాటికి పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో పార్టీ బలోపేతం పైన త్వరలో ప్రత్యేక దృష్టి సారించనున్నారని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలో ప్రకటించారు.
రానున్న ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకున్న పవన్.. తాను కోరుకున్న ప్రభుత్వాలు ఆశించిన మేర పని చేయకుంటే.. జగన్‌కు ధీటుగా ఏపీలో, టీడీపీ, కాంగ్రెస్‌లకు ధీటుగా తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర ఏ మేరకు పోషిస్తారు? అసలు పోషిస్తారా లేదా? అనేది తేలుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications