ఎన్నికల యుద్ధానికి పవన్ కళ్యాణ్ వారాహి సిద్ధం; రేపు కొండగట్టుకు; రూట్ మ్యాప్ ఇలా!!
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి సమరానికి సై అంటుంది. రేపు కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజలు అనంతరం తన మొదటి ప్రస్థానాన్ని ప్రారంభించనుంది పవన్ కళ్యాణ్ వారాహి. జనవరి 24వ తేదీన తన ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామికి పూజలు చేసిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనంతో తన సార్వత్రిక సమరాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.

రేపే పవన్ కళ్యాణ్ వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు
రేపు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని పూజలు చేయనున్న పవన్ కళ్యాణ్, వారాహికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ విడుదల చేసింది జనసేన పార్టీ. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి కొండగట్టుకు పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. అనంతరం కొండగట్టుకు చేరుకొని ఆలయాన్ని దర్శించుకుని అక్కడ స్వామివారికి పూజలు చేసుకున్న తర్వాత, వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ రెండు గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్ లో జనసేన ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చర్చించనున్నారు.

తెలంగాణా పార్టీ నేతలతో పవన్ భేటీ.. ఎన్నికలు లక్ష్యంగా ప్రణాళికలు
ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహాలు, చేపట్టబోయే కార్యక్రమాల పైన చర్చించి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు .ఆపై కొడిమ్యాల మండలం నాచుపల్లి లో ముఖ్య నేతలతో భేటీ అవుతున్న పవన్ కళ్యాణ్, సాయంత్రం నాలుగు గంటలకు ధర్మపురిలో లక్ష్మీ నరసింహ క్షేత్రంలో నారసింహ యాత్రను మొదలుపెట్టనున్నారు. ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ 32 నారసింహ క్షేత్రాలను సందర్శించనున్నారు. ముందుగా ఈ యాత్రలో ఆయన తొలిగా ధర్మపురి లోని శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు.

రేపు పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణా జనసేన నేతలు
ఇక రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాత్ర చేపడుతున్న పవన్ కళ్యాణ్ సాయంత్రం ఐదున్నర గంటలకు యాత్ర ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం అవుతారు. రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటన చేయనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున రేపు చేయనున్న పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాటు చేస్తున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వినియోగించే వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ అత్యంత శక్తివంతమైన, క్రోధరూప ధారిణి అయిన వారాహి అమ్మవారి పేరుని పెట్టుకున్నారు.

సమరానికి సై అంటున్న వారాహి.. రోడ్డెక్కేది రేపే..
వారాహి అంటే విజయానికి చిహ్నం. వెనక్కి తిరిగి చూడకుండా విజయ బావుటా ఎగరవేయాలి అన్న సంకల్పంతో తన ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. దుర్గాదేవి సప్తమాతృకలలో ఒకరైన అమ్మవారు వారాహి.. రేపు కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు అందుకున్న తర్వాత ప్రజా క్షేత్రంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనుంది. అయితే వారాహిని ప్రచారం నిర్వహించకుండా అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రులు, నేతలు చెబుతూ ఉంటే, వరాహిని అడ్డుకుంటే పాదయాత్ర చేస్తామంటూ, ఇప్పటికే జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి సమరానికి సై అంటున్న వారాహి రేపు రోడ్డు ఎక్కనుండడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అందరిలో వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications