పవన్‌పై ఇది క్లియర్?: బాబుతో తేల్చుకుంటారా?, 'హోదా' రాజకీయావసరమేనా?
పార్టీ పెట్టి మూడేళ్లయినా కార్యాచరణలో మాత్రం జనసేన పెద్దగా చేసేందేమి లేదు. ట్విట్టర్ నుంచి చేసిన ట్వీట్లు తప్ప ప్రత్యక్షంగా దేనిపైనా పోరాటం చేయలేదు.
హైదరాబాద్: పార్టీ పెట్టి మూడేళ్లయినా కార్యాచరణలో మాత్రం జనసేన పెద్దగా చేసేందేమి లేదు. ట్విట్టర్ నుంచి చేసిన ట్వీట్లు తప్ప ప్రత్యక్షంగా దేనిపైనా పోరాటం చేయలేదు. సామాజికాంశాలపై మాత్రమే అడపా దడపా పవన్ స్పందిస్తూ వచ్చారు తప్పితే.. ఈ మూడేళ్లలో ఆయన రాజకీయ ప్రస్తావన చాలా పరిమితమైనది.
వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీని పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంసిద్దం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మాత్రం ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతలోనే 'తగిన బలం ఉందనుకుంటేనే.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం' అన్న ప్రకటన వచ్చింది. దీన్నిబట్టి జనసేన పోటీ కొన్ని స్థానాలకే పరిమితమవబోతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

విమర్శలకు చెక్ పెట్టేందుకు:
బహుశా ఈ విమర్శలన్నింటికి చెక్ పెట్టడానికేమో.. త్వరలోనే పవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారని ఆ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జి హరిప్రసాద్ ప్రకటించారు. నిన్నటిదాకా సినిమాలతో బిజీగా గడిపిన పవన్.. ఇకనుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు.
పవన్ జనంలోకి వెళ్లడం జనసేనకు కలిసొచ్చేదే అయినప్పటికీ.. అధికార పార్టీతో ఆయనకున్న సఖ్య రీత్యా.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేని పరిస్థితి. ఇప్పటిదాకా అదే జరుగుతూ వచ్చింది. త్వరలో జనంలోకి వస్తానని చెబుతున్న పవన్.. ఇప్పటికైనా టీడీపీ బంధాన్ని పూర్తిగా విడునాడుతారా? అన్నది చూడాలి.
2014లో అప్పటి పరిస్థితుల మేరకు బీజేపీ, టీడీపీలకు జనసేన మద్దతిచ్చిందని హరిప్రసాద్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉంటుందనేది భవిష్యత్తులో నిర్ణయమవుతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి తమతో కలిసి వచ్చే పార్టీలన్నీ తమకు మిత్రపక్షాలేనని పేర్కొన్నారు.

టీడీపీతో అదే వైఖరి కొనసాగుతుందా?
ఏపీలో టీడీపీ బలంగా ఉందనేది వాస్తవం. నంద్యాల ఉపఎన్నిక తర్వాత పార్టీలో ఆ విశ్వాసం మరింత బలపడింది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ కొంత ఆత్మన్యూనతలో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో జనసేన పోటీ ఎవరికి లాభిస్తుందనే చర్చ జరుగుతోంది. పవన్ ఒంటరిగా పోటీ చేసినా.. చివరాఖరకు టీడీపీకే మద్దతునిస్తారన్న వాదన ఉంది. అంతేకానీ, వైసీపీతో ఆయన కలిసి నడిచే సూచనలు కనిపించడం లేదు.

బాబును నేరుగా ఎదుర్కొంటారా?
త్వరలోనే పవన్ కళ్యాణ్.. ప్రజాయాత్ర ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారమే దీని లక్ష్యం అని హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఇది పాదయాత్ర లేదా బస్సుయాత్ర లేక మరో రూపంలోనైనా ఉండవచ్చునని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజామోదమైతే ఆమోదిస్తామని, లేకపోతే వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని చెప్పారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని గతంలోను జనసేన ప్రకటించింది కానీ సీఎం చంద్రబాబుతో పవన్‌కు ఉన్న సంబంధాలు ఆ ప్రయత్నాలకు అడ్డుపడ్డాయనే అనుకోవాలి. అదే మాట ఇప్పుడూ చెబుతున్నారు. ఇప్పటికీ ఆ సంబంధాల్లో వచ్చిన మార్పు ఏమి లేదు. చంద్రబాబును పవన్ నేరుగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారన్నది అనుమానమే. అది తేలితే గానీ ప్రత్యక్ష పోరాటాలు చేస్తామన్న మాటలో విశ్వసనీయత అంచనా వేయలేం.

రాజకీయవసరాలకోసం 'హోదా':
ఏపీ ప్రత్యేక హోదాపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాడటానికి జనసేన సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు జన సైనికులకే ఇస్తామని వెల్లడించారు. జనసేన కోసం పనిచేసే వారందరికీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని హరిప్రసాద్ అన్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని జనసేన మరోసారి వచ్చే ఎన్నికల్లో వినిపించే అవకాశముంది. మరోవైపు వైసీపీ కూడా మళ్లీ ఈ అస్త్రాన్ని ఉపయోగించాలా? వద్దా? అన్న మీమాంసలో ఉంది. నిజానికి ఈ రెండు పార్టీలు కలిసి ప్రత్యక్ష పోరాటానికి దిగితే.. హోదా విషయంలో కేంద్రం కనీసం పునరాలోచనలో పడేదేమో!.
అలాంటి ఒత్తిడేమి లేకపోగా.. అటు జనసేన, ఇటు వైసీపీ రెండు పార్టీలు దాని గురించి మాట్లాడటమే మరిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ హోదా మాటెత్తుకోవడం రాజకీయావసరాల కోసం అవుతుంది తప్ప మరొకటి కాదు.

మళ్లీ 'కలిసొచ్చే'.. మాట:
నిజంగా పవన్ కళ్యాణ్‌కు చిత్తశుద్ది ఉంటే.. హోదా కోసం ఏపీ జనమంతా వైజాగ్ ఆర్కే బీచ్‌లో నిరసనకు సిద్దమైన తరుణంలో.. ఆయన అక్కడికి వెళ్లి ఉండటమో.. కనీసం దాని పట్ల సానుకూలంగా స్పందించడమో జరిగేది.
కానీ పవన్ మాత్రం ఆ నిరసన పట్ల ప్రతికూలంగా స్పందించి.. తన వైఖరి బయటపెట్టుకున్నారు. 'కలిసొచ్చే మిత్ర పక్షాలతో' పోరాటాలు చేస్తామని చెబుతూనే.. ఆనాడు వైసీపీ ఇచ్చిన నిరసన పిలుపు పట్ల ఆయన ప్రతికూలంగా స్పందించడం ఏవిధంగా అర్థం చేసుకోవాలో!












Click it and Unblock the Notifications