ఆది! మూల్యం చెల్లించక తప్పదు.. వైఎస్ ఉన్నప్పుడు అలా: వైసీపీ ఎమ్మెల్యే
నంద్యాల ఉపఎన్నికలో కచ్చితంగా దీని ప్రభావం ఉంటుందని, మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
నంద్యాల: ఎస్సీలను కించపరిచేలా మంత్రి ఆది నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. నంద్యాల ఉపఎన్నికలో కచ్చితంగా దీని ప్రభావం ఉంటుందని, మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
తాజాగా సింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇదే విషయంపై మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆది నారాయణ చేసిన వ్యాఖ్యలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఎస్సీలు చదువుకోరని, శుభ్రంగా ఉండరని వ్యాఖ్యానించిన మంత్రి.. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు విషయమన్నారు.

సీఎంకు, మంత్రులకు సలహాదారులుగా ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఎస్సీలు కూడా ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీలపై ప్రేమాభిమానాలు చూపేవారని గుర్తు చేశారు.
నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న పద్మావతి ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జననేతకు కానుకగా ఇవ్వాలని నంద్యాల ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications