చంద్రబాబును మళ్ళీ అధికారంలోకి తీసుకురావటం కోసమే; పవన్ రాజకీయ ఊసరవెల్లి: మంత్రి పేర్ని నాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని పేర్ని నాని అనుమానం వ్యక్తం చేశారు.

పవన్ రాజకీయ ఊసరవెల్లి
బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారంటూ పేర్ని నాని మండిపడ్డారు. పవన్ రాజకీయ ఊసరవెల్లి అని పేర్కొన్న పేర్ని నాని పవన్ కళ్యాణ్ తనకు జీవితాన్ని ప్రసాదించిన అన్న చిరంజీవిని మరిచిపోయారని, చిరంజీవి లేకుంటే అసలు పవన్ కళ్యాణ్ ఉండేవాడా అంటూ ప్రశ్నించారు. అందరికీ నమస్కారం పెట్టిన పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవిని మర్చిపోయాడు అంటూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ బాగుండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు అంటూ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు పేల్చారు
పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ పార్టీలోకి వస్తారని టిడిపి కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు అంటూ పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు పేల్చారు అంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా డైలాగులు చెప్పారని ఎద్దేవా చేశారు. పవన్ డైలాగులు గల్లీలోనే అని పేర్కొన్న పేర్నినాని ఢిల్లీలో ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని గట్టిగా అడగలేరా?
2014 నుండి ఇప్పటివరకు తమరు రాష్ట్రానికి ఏం చేశారని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని గట్టిగా అడగలేరా అంటూ పవన్ కళ్యాణ్ ని నిలదీశారు. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని గట్టిగా పవన్ కళ్యాణ్ నిలదీయలేరా అంటూ ప్రశ్నించారు. చట్టాలు చేసి అమలు చేయని బిజెపిని చొక్కా పట్టుకొని అడగగలరా అంటూ ప్రశ్నించారు. బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీ మెడలు వంచలేరా అని ప్రశ్నించారు.

మీరు మానసిక అత్యాచారం చేయొచ్చా?
సభ ప్రారంభంలో ఎవరిని వదలకుండా పవన్ కళ్యాణ్ నమస్కారాలు పెట్టారు. మాకు సంస్కారం ఉంది మీకు ప్రతి నమస్కారం అంటూ పేర్ని నాని పేర్కొన్నారు. ఇక వెల్లంపల్లి వెల్లుల్లి, అవంతి బంతి, రాంబో రాంబాబు అంటూ మీరు మాట్లాడొచ్చా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. ఆడ, మగ తేడా లేకుండా మీరు మానసిక అత్యాచారం చేయొచ్చా అని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు మంత్రి పేర్ని నాని.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశం ఇప్పుడుఎందుకు కలిగిందో?
తాను పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ 2014 నుండి 2019 మధ్య ఎందుకు ప్రశ్నించలేదు అంటూ మండిపడ్డారు. నాడు అమరావతి కుల రాజధాని అన్న మాటలు గుర్తు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశం ఇప్పుడు ఆయనకు ఎందుకు కలిగిందో చెప్పాలని పవన్ ను నిలదీశారు మంత్రి పేర్ని నాని. పవన్ ది పూటకో సిద్ధాంతం, రోజుకో రాజకీయం అంటూ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications