అమరావతిలో విదేశీయులకు బౌద్ధ స్థూపం విశేషాలు వివరిస్తుండగా టూరిజం అధికారి కంటబడ్డ నాణెం!
అమరావతి:పాత అమరావతిలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బుధవారం బౌద్ధ స్తూపం చూసేందుకు ఇక్కడకు విచ్చేసిన విదేశీ పర్యాటకులకు ఒక పర్యాటక శాఖ అధికారి అక్కడి విశేషాలను గురించి వివరిస్తుండగా అక్కడ మట్టిలో కూరుకుపోయి ఉన్న ఒక నాణెం ఆయన కంటబడింది. దీంతో ఆయన దానిని ఆసక్తిగా వెలికితీసి పరిశీలించడగా దానిపై అర్థం కాని లిపిలో అక్షరాలు ఉన్నాయి.
ఆ తరువాత దానిని అక్కడే ఉన్న పురావస్తుశాఖ మ్యూజియం అధికారులకు చూపగా అద వెండితో చేయబడిన నాణెమని...దానిపై లిపి పర్షియన్ భాషలోని అక్షరాలని తెలిపారు. ఆ నాణెం సుమారు 17వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్నారు. ఇలా ఈ అరుదైన పురాతన నాణెం లభ్యమైనది టూరిజం శాఖ ఈడీ మల్లి ఖార్జున్ కి కాగా ఆయన దానిని ఆయన పురావస్తు శాఖ అధికారులకు అప్పగించారు.

గౌతమ బుద్ధుని అవశేషాలను పూజల నిమిత్తమై పొందుపరచి వాటిపై కట్టిన కట్టడాన్ని బౌద్ధ స్తూపం అంటారు. ఆంధ్రప్రదేశ్ నందు ముఖ్యముగా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో బౌద్ధమతము మౌర్యకాలము నుండి పరిఢవిల్లినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అమరావతి (ధరణికోట),భట్టిప్రోలు,జగ్గయ్యపేట,బేతవోలు,ఘంటసాల, శాలిహుండం మొదలైన చోట్ల ఈ బౌద్ధ స్తూపాల నిర్మాణము జరిగింది.
అయితే వీటిలో అమరావతి స్తూపం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఈ అమరావతి స్తూపంపై కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా పరిశోధన జరపగా అమరావతి (ధాన్యకటకము) పట్టణం క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిందని తెలిసింది. ఇక పర్షియన్ నాణెం విషయానికొస్తే నేడు ఇరాన్ గా పిలవబడే దేశం పురాతన నామమే పర్షియా.
పర్షియన్ భాషనే పారసీ, పార్శీ, ఫార్శీ అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు.
ఇది ఇండో-యూరోపియన్ భాషకు చెందిన శాఖ అయిన ఇండో-ఇరానియన్ భాష. ఈ భాషను మాట్లాడే వారు దేశాలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మరియు తజకిస్తాన్ మరియు ఇండియాలో కూడా ఉన్నారు. మన దేశంలో అనేక షియా మతస్తులు, జొరాస్ట్రియన్ మతస్తులు ఈ భాషలోనే మాట్లాడతారు. అలాగే తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాదు నగరంలో ఈ భాషను మాట్లాడేవారు నేటికి అనేకమంది ఉన్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications