10 వందేభారత్ రైళ్ళ ప్రారంభంతో హాఫ్ సెంచరీ దాటిన వందేభారత్ రైళ్ళు: కేంద్రమంత్రి కితాబు!!
భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో 85వేల కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అహ్మదాబాద్లో ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో రైల్వే నెట్వర్క్, మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా పలు రైల్వే అభివృద్ది పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చ్యుల్ గా ప్రారంభించిన సందర్బంగా అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ళలో రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ 20రెట్లు పెరిగిందని చెప్పారు.

రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రయాణీకుల ఆధునిక సదుపాయాల కల్పనకూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి చెప్పారు. నేడు పది వందే భారత్ రైళ్ళను ప్రారంభించారని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు నడుస్తున్నాయని, ఇవాళ మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. 10 వందేభారత్ రైళ్ళ ప్రారంభంతో వందేభారత్ రైళ్ళు హాఫ్ సెంచరీ దాటాయన్నారు.
త్వరలో జంట నగరాల సమీపంలో నిర్మాణం అవుతున్న చర్లపల్లి రైల్వే టర్మినల్ ను కూడా ప్రారంభించుకోనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ AK జైన్ మాట్లాడుతూ సికింద్రాబాద్ -విశాఖపట్నం రెండో వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ నుంచి వర్చ్యుల్ గా జెండా ఊపి ప్రారంభించారని, అలాగే రాష్ట్రంలోని 50 పైగా 'ఒక స్టేషన్- ఒక ఉత్పత్తి' స్టాళ్ళను ప్రధాని ప్రారంభించారన్నారు.
ఇందులో ఐదింటిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కాజీపేట్-బలార్షా, కాజీపేట్ - విజయవాడ సెక్షన్ ల ట్రిప్లింగ్ ప్రాజెక్టులనూ ఈ సందర్భంగా జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో రామగుండం, సుల్తానాబాద్, తిప్పర్తి లలో ఏర్పాటు చేసిన PM గతి శక్తి రైల్వే టర్మినళ్ళను, నాలుగు చోట్ల సరకు రవాణా షెడ్లను కూడా జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా, సికింద్రాబాద్ స్టేషన్లో జన ఔషధీ కేంద్రాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications