ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధిని చేయడంపై దృష్టి సారించింది. ఈ దిశగా మరో ముందడుగు వేసింది. డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ సాకారం కాబోతోంది. చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. డ్రోన్ సిటీ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించనున్న విషయం తెలిసిందే. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు. దీంతో పాటు- డ్రోన్ ఉపయోగాలు, ఈ రంగంలో సాధించిన ప్రగతిని చాటిచెప్పేలా డిసెంబర్‌లో భారీ డ్రోన్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆర్టీజీఎస్, పౌర సేవలపై ఉన్నతస్థాయి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, ఐటీ, ఆర్టీజీఎస్, అధికారులు పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని, ట్రాఫిక్ నిర్వహణ, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీటీవీ కెమెరాలను సమర్థవంతంగా వినియోగించాలని ఆయన సూచించారు.
డ్రోన్లను ప్రభుత్వ అవసరాలతో పాటు ప్రైవేట్ రంగంలో భారీ ఎత్తున వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో దీన్ని విస్తృతం చేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాలకు కూడా సరుకుల పంపిణీకి డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పౌర సేవలను మరింత మెరుగుపరచాలని, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని చంద్రబాబు సూచించారు.
అభివృద్ధి పనులపై ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించాలని, డేటాను విశ్లేషించాలని ఆదేశించారు. 19 ప్రభుత్వ శాఖల సేవలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని, నెలవారీ ఆడిట్లు నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు జరిగాయని, వాటిని సరిదిద్దడానికి కృషి చేస్తోన్నామని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications