చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్: కలెక్టరేట్‌లోనే చంద్రబాబు, అర్ధరాత్రి పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్తిస్తున్నవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి ఫోన్ చేశారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వరద పరిస్థితి గురించి సీఎంను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయక సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం తీసుకుంటున్న సహాయక చర్యలపై ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలిచ్చామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించినట్లు ఈ సందర్భంగా ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుతో తెలిపారు. తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఆదేశాలిచ్చామని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కేంద్ర సహాయంపై ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

సాధారణస్థితి వచ్చే వరకు కలెక్టరేట్‌లోనే: చంద్రబాబు
విజయవాడలో సాధారణస్థితి వచ్చే వరకు తాను కలెక్టరేట్‌లోనే ఉంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విజయవాడ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదన్నారు. క్షేత్రస్థాయిలో తీవ్రత చెప్పడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు, ఆహారం, తాగునీరు, కొవ్వొత్తులు, టార్చ్ లు వెంటనే వరద బాధితులకు అందించాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వరద సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్ష బాధితులను పరామర్శించేందుకు విజయవాడ సింగ్ నగర్ లోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పర్యటించారు.#AndhraPradesh pic.twitter.com/0sp2RRoYoB
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 1, 2024
లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్నారు సీఎం చంద్రబాబు. ఇతర ప్రాంతాల నుంచి అదనపు బూట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పించాలని ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. తక్షణమే అందుబాటులో ఉన్న ప్యాక్డ్ ఫుడ్ బాధితులకు అందించాలన్నారు. బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందిద్దామన్నారు. అక్షయపాత్ర నుంచి, సరఫరా చేయగలిగిన ఇతర ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని ఖర్చు గురించి ఆలోచన చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తక్షణ సహాయాన్ని అందించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు సంసిద్ధంగా ఉన్నారు. వరద ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన… pic.twitter.com/A9ZsqPx1oE
— N Chandrababu Naidu (@ncbn) September 1, 2024
అర్ధరాత్రి మరోసారి విజయవాడలో పర్యటించిన చంద్రబాబు
ఆదివారం మధ్యాహ్నం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బోటులో ప్రయాణించి బాధితులను పరామర్శించిన చంద్రబాబు.. మళ్లీ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలోనూ పర్యటించారు. సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు బాధితులకు ఆహార పదార్థాలు అందాయా? అని ఆరా తీశారు. చంద్రబాబు మరోసారి రావడంతో అధికారులు హుటాహుటిన స్పందించి బాధితులందరికీ ఆహార పదార్థాలను అందించారు. బాధితులకు అండగా ఉంటామని వారికి చంద్రబాబు భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications