చంద్రబాబు విడుదలవ్వాలని తిరుమలకు పాదయాత్ర చేస్తున్న టీడీపీనేతలు!!
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబును ఎసిబి కోర్టులో హాజరుపరచగా కోర్టు ధర్మాసనం చంద్రబాబుకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గత మూడు రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
చంద్రబాబు నాయుడు బయటకు రావాలని టిడిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలో జైలు నుండి విడుదల కావాలని కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది నేడు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.
కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టారు.

మొత్తం 230 కిలోమీటర్లు కాలి నడకన తిరుమలకు వెళ్లి చంద్రబాబు విడుదల కావాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వారు ప్రార్ధించనున్నారు. పొద్దుటూరు నుండి తిరుమలకు 230 కిలోమీటర్ల దూరం ఉండగా ఈరోజు ఉదయం నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టారు. వారం రోజుల పాటు ఈ పాదయాత్ర సాగనుంది.
పాదయాత్ర చేపట్టిన సందర్భంగా పొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబు ని అరెస్ట్ చేసి జైలుకు పంపారని పేర్కొన్నారు. జగన్ తాను జైలు జీవితాన్ని అనుభవించారని, అందుకే చంద్రబాబును కూడా జైలుకు పంపాలని అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమించే చంద్రబాబును పగబట్టి మరీ అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపారన్నారు.
చంద్రబాబు మచ్చలేని నాయకుడిగా బయటకు వస్తాడని ప్రవీణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఏపీలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు అన్నిటిని బయటకు తీస్తామని ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బెయిల్ పై బయట తిరుగుతున్న జగన్ ఇప్పటికైనా కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications