దాడి కేసులో వారిని అదుపులోకి తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాడి కేసును ప్రభుత్వం ముందుకు కదిలించింది. విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఈరోజు కీలక అడుగు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు కార్యకర్తలను అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో మొహియుద్దీన్, రాంబాబు, వెంకట్ రెడ్డి, దేవానందం, మస్తాన్ వలి ఉన్నారు.
అదుపులో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు?
ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించారు. నాలుగు రోజులగా కీలకమైన ఆధారాలను సేకరించారు. టీడీపీ కార్యాలయంపై విధ్వంసానికి పాల్పడినవారిని సీసీ కెమెరాలద్వారా గుర్తించారు. వీరిలో గుంటూరుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు. తమకోసం పోలీసులు గాలిస్తున్నారని తెలియడంతో కొందరు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీలో చేరతామంటూ రాయబారాలు పంపించారు. అయితే పోలీసులు గుంటూరుకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరిని అరెస్ట్ చేశారు. మిగతావారికోసం గాలింపు మొదలుపెట్టారు.

పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తున్న ప్రభుత్వం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలపై నమోదైన కేసులను తిరిగి ఓపెన్ చేస్తోంది. ఇందులో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితోపాటు చంద్రబాబు నివాసంపై దాడి కేసు కూడా ఉంది. ఈ కేసులో రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్ కీలకంగా వ్యవహరించినట్లు భావించిన ప్రభుత్వం ఆధారాలను పకడ్బందీగా సేకరిస్తోంది. ఈ కేసులో త్వరలోనే జోగి రమేష్ ను అరెస్ట్ చేయబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications