పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ - 9 మందిపై కేసుల నమోదు : 7గురు టీచర్లతో సహా..!!
ఏపీలో పదో తరగతి పరీక్ష పత్రాల లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. ప్రభుత్వం లీకేజ్ కాలేదని...మాల్ ప్రాక్టీసుగా అధికారులు కొందరు చెబుతున్నారు. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పరీక్షలు ప్రారంభమైన సమయం నుంచి ఇదే రకమైన ప్రచారం కొనసాగుతూ ఉంది. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలసులు ఏడుగురు టీచర్లతో సహా 9 మంది పైన కేసు నమోదు చేసారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో ప్రశ్నాపత్రాల లీక్‌పై పోలీసులు దర్యాప్తు చేసారు.
గణితం పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, విచారణలో ప్రశ్నాపత్రం జవాబు పత్రాలు జిరాక్స్ తీయించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. జవాబు పత్రాలను టీచర్ జిరాక్స్ సెంటర్‌లో తీయించినట్లు గుర్తించారు. కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని టీచర్లకు వాట్సప్ ద్వారా జవాబు పత్రాలు చేరవేసినట్లుగా తేల్చారని సమాచారం. కృష్ణా జిల్లా పామర్రు, నందివాడ, గుడివాడ టీచర్లకు జవాబు పత్రాలు చేరవేసినట్లుగా తెలుస్తోంది.

ఏలూరు జిల్లా మండవల్లిలో టీచర్లకు జవాబు పత్రాలు చేరవేసారని విచారణలో గుర్తించినట్లుగా సమాచారం. దీంతో..పోలీసులు పలువురు టీచర్లను విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఏడుగురు టీచర్ల తో సహా 9 మంది పైన కేసు నమోదు చేసారు. కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ప్రశ్నాపత్రం లీక్, మాల్ ప్రాక్టీస్ కింద విచారణ సాగుతోంది. ఈనెల 27నుంచి ప్రారంభమైన పదోతరగతి పరీక్షల నిర్వహణపై వరుస వివాదాలు తలెత్తుతున్నాయి.
27, 28 తేదీల్లో తెలుగు, హిందీ పేపర్లు ప్రారంభమైన గంటన్నర తర్వాత బయటకు వచ్చాయని, దీన్ని లీక్‌గా భావించబోమని అధికార యంత్రాంగం ప్రకటించింది. రాష్ట్రంలో పదోతరగతి పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ కాలేదని, కుట్రలు, కుతంత్రాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ప్రశ్నపత్రాలను తెరిచే సమయంలోనే సెల్‌ఫోన్లతో ఫొటోలు తీస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications