పట్టాభి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. ఉద్రిక్తత
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కె.పట్టాభిరాం ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విజయవాడలోని ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రాత్రి అదనపు బలగాలను పంపించి ఇంటిచుట్టూ మోహరింపచేశారని పట్టాభి తెలిపారు. వారం రోజుల క్రితం సెక్షన్ 41-ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు వన్ టౌన్ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. అయితే ఆ సమయంలో మీడియా ప్రతినిధులు కూడా అక్కడే ఉన్నారు. మేం వస్తున్న విషయాన్ని మీడియాకు చెప్పాల్సిన అవసరం ఏముందని పోలీసులు ప్రశ్నించగా, అందులో తప్పేముందంటూ ఇరువర్గాల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. తర్వాత నోటీసులు జారీచేశారు.
పట్టాభి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న పోలీసులు ఇంటి చుట్టూ ఉన్నరన్న విషయం తెలియడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడకి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విజయవాడలో దళిత గర్జన నేపథ్యంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు.

పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమను ముందుగా గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. దళిత గర్జనకు వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ఆయన మండిపడ్డారు. దళితులకు చంద్రబాబు పాలన స్వర్ణయుగం లాంటిదన్నారు. కోర్టులు ముందస్తు నిర్బంధాలు వద్దంటూ చెప్పినప్పటికీ ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, దళిత గర్జన జరిగితే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మోసాలు బయటపడతాయనే ఇలా చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని దూషించిన కేసులో గతంలో కూడా పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కూడా ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications