రక్తచరిత్రని మరచిపోలేం: 'కలిసి పనిచేయడం కుదిరే పనికాదు'
అమరావతి: జమ్మలమడుగులో టీడీపీకి చెందిన ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఒకే గొడుకు కిందకు వస్తారా? కరుడుగట్టిన ఫ్యాక్షన్ గడ్డపై ఇరువర్గాలకు చెందిన నేతలు కలిసి పయనించడం సాధ్యమేనా? అంటే కాదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేతలు పార్టీ మారినంత మాత్రాన వారి అనుచరగణం మారతారా అనేది ప్రశ్నార్ధకమే.
ఇటీవలే వైసీపీ తరుపున గెలిచిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో జరుగుతున్న రసవత్తర చర్చ ఏమిటి? కడప జిల్లాలోనే కరుడుగట్టిన ఫ్యాక్షన్ రాజకీయాలకు జమ్మలమడుగు పేరుగాంచింది.
ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా ఇరువర్గాల నేతలు ఒకే పార్టీలో కలిసి పనిచేయడం సాధ్యమేనా అంటే సాధ్యం కాదన్న సమాధానమే నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. "రాజకీయ నాయకులు వారి స్వార్ధం కోసం పార్టీలు మారితే మారొచ్చు. అంతమాత్రాన నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన రక్తచరిత్రని మరచిపోలేం. మా కుటుంబాల్లో ఎందరో వ్యక్తులు ప్రత్యర్థుల దాడిలో బలైపోయారు. ఆ పగని, పౌరుషాన్ని పక్కనబెట్టి ప్రత్యర్థులతో చేతులు కలిపి, ఒకే పార్టీలో కలిసి పనిచేయడం కుదిరేపని కాదు'' అంటున్నారు.
నేతలు పార్టీ మారినా వారి అనుచరగణం మాత్రం పగ ప్రతీకారం అంటూ పౌరుషంతోనే ఉన్నారు. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఆదినారాయణరెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకుని 10 రోజులు గడిచిపోయింది. ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకునే సమయంలో ఆయన చిరకాల ప్రత్యర్ధి అయిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి, ఆయన కుటుంబసభ్యులతో స్వయంగా చంద్రబాబే చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

అయితే పార్టీ అధినేత చేసిన సూచనలు మాత్రం జమ్మలమడుగులో అమలు కావడం లేదని సమాచారం. పాతకక్షలను పక్కనబెట్టి ఇరువర్గాల నేతలు ఒక్కటై జమ్మలమడుగులో టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు చెప్పారు. ఇరువర్గాలకు చెందిన నేతలకు ఏ విషయంలోనూ అన్యాయం జరగదని ఆయన స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు.
విజయవాడలో ఆదినారాయణ రెడ్డిని టీడీపీలోకి చేర్చుకునే సమయంలో రామసుబ్బారెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు స్వయంగా సముదాయించారు. ఈ సందర్భంలో రామసుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి చిన్నమ్మ అలక బూనారు. కొన్ని గంటల పాటు హైడ్రామా నడిచిన తర్వాత చివరకు ఆదినారాయణరెడ్డికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి చేరడం ఇరువర్గాల నేతలకు నచ్చడం లేదు. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజక వర్గంలోని ద్వితీయస్థాయి నేతలు ఇప్పటికీ ఆదినారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరడాన్ని స్వాగతించడం లేదు. మరోవైపు రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, వారి అనుచరగణం కూడా ఈరోజుకీ ఈ పరిణామం పట్ల కాస్తంత గుర్రుగానే ఉన్నారు.
చాలా మంది ద్వితీయస్థాయి నేతలు కలిసి పనిచేయడం కుదరదని ఖరాఖండిగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి చేరిన తర్వాత రామసుబ్బారెడ్డితో ఒక్కసారిగా మాట్లాడకపోవడం విశేషం. ఇటీవల ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నియోకవర్గంలో టీడీపీ సమావేశం నిర్వహించగా రామసుబ్బారెడ్డి వర్గీయులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదట.
ఆదినారాయణరెడ్డి ఈ సమావేశానికి తన వర్గీయులనే ఆహ్వానించి, రామసుబ్బారెడ్డి వర్గానికి సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఈ సమావేశంలో ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ తాము ప్రత్యర్థుల గురించి పట్టించుకోమనీ, తమను రెచ్చగొడితే మాత్రం అంతకు రెండింతలు వారిని ఇబ్బంది పెడతామనీ రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి ప్రకటించడం కూడా రుచించడం లేదు.
ఈ వ్యాఖ్యల పట్ల రామసుబ్బారెడ్డి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదరడం, ఈ రెండు వర్గాలు కలిసి పనిచేయడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications