AP Results: కౌంటింగ్ కు ముందే ఏపీ ఫలితం డిసైడ్ ? కీలకంగా ఈసీ నిర్ణయం..!
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున జరిగిన పోలింగ్ అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆశలు రేపుతోంది. దీంతో భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమకే అండగా నిలిచారని ప్రతీ రాజకీయ పార్టీ చెప్పుకుంటోంది. అయితే వాస్తవం మాత్రం జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో ఎలాగో తేలిపోనుంది. అయితే అంతకు ముందే ఎన్నికల ఫలితాలు ఎటువైపు ఉన్నాయనే దానిపై కీలక సంకేతాలు వెలువడ్డాయి.
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల్లో జరిగిన సాధారణ ఓటింగ్ తో పాటు ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా కలిపి లెక్కిస్తారు. అయితే ఇందులోనూ ఈసారి భారీఎత్తున ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా దాదాపు 5.4 లక్షల ఓట్లు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రభుత్వాన్ని నడిపే ఉద్యోగులవే. అంతే కాదు రేపు ఎన్నికల ఫలితాన్ని ముందస్తుగానే డిసైడ్ చేసేవిగా భావిస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ భారీగా జరగడాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్ గానే పరిగణిస్తారు. అంతే కాదు ఉద్యోగుల ఆగ్రహం ఎక్కువగా ఉండే భారీ స్దాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందని భావిస్తారు. ఈ లెక్కన చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా నమోదవడంతో అధికార వైసీపోల కలవరం రేగుతోంది. దేశంలోనే రికార్డు స్దాయిలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అధికార పార్టీకి వ్యతిరేకంగానే జరిగిందని రాజకీయ పక్షాలు చెప్పుకుంటున్నాయి.
దీంతో ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వచ్చిన 5.4 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేయించాలని అంశంపై ఈసీ నిర్ణయం కీలకంగా మారింది. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. రాష్ట్రంలో అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి.
ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు రావడంతో ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేయాలన్న దానిపై చర్చ జరుగుతోంది.
ఒక్కో టేబుల్‍లో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ట్లు లెక్కించాలనే అంశంపై రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారం పంపింది. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని విపక్ష టీడీపీ ఈసీని కోరుతోంది. దీనికి రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా మౌఖికంగా అంగీకరించారు. కానీ టీడీపీ రాతపూర్వక ఆదేశాలు కోరుతోంది. డిక్లరేషన్‍పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. రిటర్నింగ్ అధికారి ఫాసిమెయిల్, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్‍దే అని చెబుతోంది.












Click it and Unblock the Notifications