AP Results: ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాల ఆలస్యం ? కీలక కారణమిదే..!
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 82 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా భారీగా ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం 2 శాతం పెరిగితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మాత్రం రెట్టింపు అయింది. తాజాగా ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. దీని ప్రభావం కచ్చితంగా కౌంటింగ్ పై పడబోతోంది.

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 5.4 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిని లెక్కించేందుకు ఆయా జిల్లాల్లో వేయించాల్సిన టేబుల్స్ పై ఈసీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం 50 టేబుల్స్ వేయిస్తున్నారు. ఆ తర్వాత ఒంగోలులో 41 టేబుల్స్ వేయిస్తున్నారు. అలాగే విజయనగరంలో 30 టేబుల్స్ వేయించాల్సిన పరిస్ధితి. మిగతా జిల్లాల్లో మాత్రం సగటున 14 నుంచి 20 టేబుల్స్ వరకూ వేయిస్తున్నారు.
ఒక్కో టేబుల్ కూ గరిష్టంగా చూస్తే కడపలో టేబుల్ కు 1780 ఓట్లు లెక్కించనుండగా.. గుంటూరులో 1717 ఓట్లు లెక్కిస్తారు. అనకాపల్లిలో టేబుల్ కు 1627 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. ఇలా చూసుకుంటే ఒక్కో టేబుల్ కు కనిష్టంగా 572 ఓట్ల నుంచి గరిష్టంగా 1780 ఓట్ల వరకూ లెక్కించాల్సి ఉంది. దీంతో కౌంటింగ్ జరిగే జూన్ 4న ముందుగా లెక్కించే పోస్టల్ బ్యాలెట్ ఓట్లే గతంతో పోలిస్తే ఎక్కువ సమయం తీసుకోబోతున్నాయి. ఆ తర్వాత రెగ్యులర్ కౌంటింగ్ జరగనుంది. ఈ లెక్కన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే 10 గంటల తర్వాత కౌంటింగ్ సరళి తెలియనుంది.












Click it and Unblock the Notifications