ప్రకాశం జిల్లాలో గ్యాస్ సిలెండర్ల లారీలో భారీ అగ్నిప్రమాదం, పేలిన సిలెండర్లతో రోడ్డు ధ్వంసం!!
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ వద్ద అమరావతి అనంతారం జాతీయ రహదారి పై ఎల్పిజి సిలిండర్ లతో వెళుతున్న లారీలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడం మొదలు పెట్టాయి. మొత్తం లారీలో ఉన్న 100 సిలిండర్లు ఇప్పటివరకు పేలినట్లు తెలుస్తోంది.
Recommended Video
కర్నూలు నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడు వెళుతున్న క్రమంలో ఈ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ లారీలో మొత్తం 300 సిలెండర్లు ఉన్నట్టుగా గుర్తించారు. లారీ లో షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్లు పేలుడుకు గురవడంతో భారీ శబ్దాలతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. లారీలో మంటలు చెలరేగడం గమనించిన లారీ డ్రైవర్ లారీ దిగి అక్కడి నుండి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు.
ప్రకాశం జిల్లా కొమరోలులో లారీలో షార్ట్ సర్క్యూట్.. పేలిన గ్యాస్ సిలిండర్లు..!!#Komarolu #Prakasham #AndhraPradesh #ApNews #OneIndiaTelugu pic.twitter.com/gQlQag5Onr
— oneindiatelugu (@oneindiatelugu) September 2, 2022
భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం, పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా మంటలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికీ సిలిండర్ల పేలుడు కొనసాగుతోంది. లారీలో మొత్తం 300 సిలెండర్లు ఉండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. లారీలో భారీ స్థాయిలో గ్యాస్ సిలిండర్లు పేలిన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పొలాలలోకి గ్యాస్ సిలిండర్లు ఎగిరిపడడంతో సమీప ప్రాంతాలకు ఎవరూ రాకుండా రెస్క్యూ టీం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో లారీ కూడా ఆనవాళ్లు లేకుండా ధ్వంసం అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేస్తూ లారీ శకలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. లారీకి విద్యుత్ వైర్లు తగలటంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications