జగన్ కామెంట్స్ పై స్పందించిన పీకే - దానర్థం అదే ! జూన్ 4న చూసుకుందాం..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు మరో రెండు వారాల సమయం కూడా లేదు. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నాయి. ఇదే క్రమంలో ఏపీలో జగన్ దారుణంగా ఓడిపోతున్నారంటూ ఎన్నికలకు ముందే చెప్పేసిన ఆయన ఒకప్పటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. తాజాగా మరో ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో జగన్ తాజాగా చెప్పిన జోస్యానికి అర్ధం చెప్పారు.
ప్రముఖ జర్నలిస్టు బర్కాదత్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈసారి ఏం జరగబోతోందో చెప్పేశారు. ఇందులో ఆయన ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మోడీ సర్కార్ పై జనంలో అసంతృప్తి ఉందని, కానీ ఆగ్రహం లేదన్నారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి కాస్త అటు ఇటుగా సీట్లు వస్తాయని, కానీ దక్షిణాదితో పాటు తూర్పున ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెరగబోతున్నాయని పీకే జోస్యం చెప్పారు.

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతున్నాడని తాను గతంలో చెప్పానని, కానీ ఆయన మాత్రం ఈ మధ్యే ప్రశాంత్ కిషోర్ గెలిపించిన సీట్ల కంటే ఎక్కువగా సాధించబోతున్నామని చెప్పుకోవడంపై పీకే స్పందించారు. జగన్ అలా చెప్పుకోవడంలో తప్పేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్, అమిత్ షా వంటి వారు కూడా ఇదే చెప్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారు నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా తదుపరి రౌండ్లలో గెలుస్తున్నామనే చెప్తారన్నారు. జూన్ 4న జగన్ మాటల్లో, లేక తన మాటల్లో ఏది నిజమో తేలిపోతుందన్నారు.
ఎన్నికలకు ముందే ఏ రాజకీయ నేత కూడా తమ ఓటమిని అంగీకరించబోరని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈసారి ఏపీలో జగనే కాదు చంద్రబాబు కూడా గెలుస్తున్నామనే చెప్తున్నారని పీకే గుర్తుచేశారు. అయితే జగన్ ఇందుకు అదనంగా గతంలో కంటే ఎక్కుక సీట్లు గెలుస్తున్నామని చెప్తున్నారని, అలా జరిగే అవకాశం లేదని ప్రశాంత్ కిషోర్ తేల్చిచెప్పేశారు. దీంతో గతంలో తాను ఎన్నికల ముందు చెప్పిన జోస్యానికే కట్టుబడి ఉన్నట్లు చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications