పులివెందుల పోలీసు కాల్పుల కేసులో బిగ్ టర్న్- వైసీపీ అనూహ్య డిమాండ్..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్ధుల్ని నామినేషన్లు వేయనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్న తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతల్ని మించి పోయి పోలీసులు పలు చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని అడ్డుకోవడం, అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి నిర్బంధించడం, బెదిరించి నామినేషన్లు ఉపసంహరింపజేయడం వంటి ఘటనలు విమర్శలకు తావిస్తున్నాయి. వీటన్నింటికీ పరాకాష్టగా పులివెందులలో గాల్లో కాల్పులు జరిపిన ఘటన మరింత వివాదాస్పదమైంది.
ఈ నేపథ్యంలో పులివెందులలో (Pulivendula) పోలీసులు ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే గాల్లోకి కాల్పులు జరిపిన వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఇవాళ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పులివెందులలో తమ అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు వెళ్తుంటే.. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు పూర్తిగా అండగా నిలుస్తూ,ఇంకా వారికి ఏ కష్టం లేకుండా చేస్తూ పోలీసులే దాడులకు దిగారని, ఎలాంటి కవ్వింపు లేకుండా గాల్లోకి కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు. కాశ్మీర్ వంటి దేశ సరిహద్దుల్లో శత్రువులపై కాల్పులు జరిపినట్లు, ప్రజల ప్రాణాలంటే ఏ మాత్రం లెక్క లేకుండా కాల్పులు జరుపుతున్నారన్నారు.

సినిమాల తరహాలో ఇష్టారాజ్యంగా పోలీసులు కాల్పులకు దిగుతున్నారని సజ్జల విమర్శించారు. నక్సలైట్లు ఉన్నప్పుడు కూడా ఇలా చేయలేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రాయోజిత హింసలా ఇది కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిపై ఇలా కాల్పులకు చేయడం భయోత్పాతం సృష్టించడమే అవుతుందని సజ్జల ఆక్షేపించారు. తాము ఉద్యోగం చేస్తున్నామో, గూండాయిజం చేస్తున్నామో పోలీసులకు తెలియడం లేదా? ఇదంతా వ్యవస్థీకృత, ముందస్తు నేరమే అన్నారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడులకు, కేసులకు వైఎస్సార్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ భయపడరన్నారు. కానీ ఎస్ఈసీ ఇలాంటి పనులు చేయొద్దని కనీసం చిన్న వార్నింగ్ అయినా ఇవ్వాలని కోరుకుంటున్నట్లు సజ్జల పేర్కొన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ఇవాళ కూడా ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠాను కలిసి 50 మందికి పైగా పోలీసు అధికారులపై ఫిర్యాదు చేశారు. వీరంతా కూటమికి మద్దతుగా నిలబడి, వైఎస్సార్సీపీ అభ్యర్దుల్ని టార్గెట్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేసారు.














Click it and Unblock the Notifications
