కుప్పం లెక్క సరిచేసిన టీడీపీ ! పులివెందులలో వైసీపీ డిపాజిట్ గల్లంతు..!
గత దశాబ్దకాలంగా ద్విముఖంగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వీరు వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో గతంలో వైసీపీ హయాంలో కుప్పంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని ఓడించి చంద్రబాబును దెబ్బ తీశానని జబ్బలు చరుచుచుకున్న జగన్ కు ఇప్పుడు ఆయన సొంత గడ్డ పులివెందులలో జడ్పీటీసీ స్ధానాన్ని డిపాజిట్ లేకుండా చేసి గెలిచి చంద్రబాబు ప్రతీకారం తీర్చుకున్నారు.
2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు టార్గెట్ గా జగన్ పావులు కదిపారు. ముఖ్యంగా చంద్రబాబు వరుసగా గెలుస్తున్న కుప్పం సీటులో లెక్కల్ని మార్చాలని టార్గెట్ పెట్టుకున్న జగన్.. అందుకు స్థానిక ఎన్నికల్ని పావుగా వాడుకున్నారు. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ముందుగా పంచాయతీ పోరులో వైసీపీ ఘన విజయం సాధించి టీడీపీకి తొలి షాక్ ఇచ్చింది. అదే ఏడాది మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలిచి ఇక చంద్రబాబును ఎమ్మెల్యేగా ఓడించడమే లక్ష్యంగా వైనాట్ కుప్పం అని ప్రకటించింది.

అప్పట్లో చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 89 గ్రామ పంచాయతీలకు గానూ 74 చోట్ల విజయం సాధించింది. టీడీపీ 14 పంచాయతీల్లోనే గెలిచింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలోని మొత్తం 25 వార్డులకు గానూ వైసీపీ 18 వార్డులు గెలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 6 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం స్ధానంలో గతేడాది అధికారంలోకి వచ్చిన టీడీపీ కుప్పం మున్సిపాల్టీని తిరిగి కైవసం చేసుకుంది.

ఇప్పుడు ఏకంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో పాటు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్ధానాల్లో ఉపఎన్నికలు రావడంతో వాటిని ఎలాగైనా గెలవాలని చంద్రబాబు టార్గెట్ పెట్టుకున్నారు. అనుకున్నట్లుగా దీటైన అభ్యర్ధులను దించడంతో పాటు అధికార బలంతో అన్ని అస్త్రాలూ ప్రయోగించారు. దీంతో వైసీపీ ఇవాళ పులివెందుల జడ్పీసీటులో డిపాజిట్ కోల్పోయి పరువు పొగొట్టుకుంది. అదే సమయంలో గతేడాది ఎన్నికల తర్వాత కడప జిల్లాలో తన పట్టును టీడీపీ మరోసారి నిరూపించుకుంది.












Click it and Unblock the Notifications