అప్‌సెట్: పురంధేశ్వరి మెట్టు దిగినా బెట్టువీడని బాబు!
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి మెట్టు దిగినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బెట్టు వీడటం లేదా? అంటే అవుననే అంటున్నారు. బిజెపి, టిడిపిల మధ్య పొత్తు చిచ్చు రాజుకున్న విషయం తెలిసిందే. బిజెపి పలుచోట్ల బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టిందని, వాటిని చూస్తుంటే భయం వేస్తోందని చంద్రబాబు గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
బిజెపి, టిడిపి పొత్తు అలజడికి పలు కారణాలు ఉన్నాయి. విశాఖపట్నం, నర్సాపురం తదితర పలుచోట్ల బిజెపి బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టిందని, అది ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరుస్తుందని టిడిపి చెబుతోంది. ఆ అభ్యర్థులను మార్చాల్సిందేనని అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణకు మద్దతిచ్చిన బిజెపితో పొత్తు వద్దని సీమాంధ్ర టిడిపి నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా బిజెపితో కలిసి పోటీ చేస్తే మైనార్టీలు దూరమవుతారని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీటన్నింటిని పరిధిలోకి తీసుకొని చంద్రబాబు బిజెపితో పొత్తుకు దూరం జరగాలనుకుంటున్నారట. ఇందులో ప్రధానంగా ఆయన వదిన పురంధేశ్వరి వ్యవహారం కూడా ఉంది. బిజెపి తెలంగాణకు మద్దతివ్వడం, పొత్తు పెట్టుకుంటే మైనార్టీలు దూరం కావడం.. వంటివి కొత్త వాదనలు కాదు. అంతేకాకుండా ఇటీవల మైనార్టీలు బిజెపికి దగ్గరవుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రధానంగా పురంధేశ్వరి వ్యవహారం చంద్రబాబును ఎక్కువ అప్ సెట్‌కు గురి చేసి ఉంటుందంటున్నారు.
తొలుత విశాఖ సీటును పురంధేశ్వరికి ఇచ్చేందుకు బిజెపి సుముఖత చూపినప్పటికీ బాబు కారణంగానే ఆ సీటును కోరుకుంటున్న కంభంపాటి హరిబాబుకు వెళ్లిందంటున్నారు. ఇప్పుడు ఆమెకు బిజెపి రాజంపేట టిక్కెట్ ఇచ్చింది. దీనిని కూడా బాబు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఆమెకు టిక్కెట్ ఇవ్వవద్దని చంద్రబాబు బిజెపికి షరతు పెట్టినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చినా వాటిని ఖండించారు. అయితే, ప్రస్తుత వ్యవహారాలు చూస్తుంటే అది నిజమేనన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
ఈ నేపథ్యంలో పురంధేశ్వరి మెట్టు దిగినా చంద్రబాబు మాత్రం బెట్టు వీడినట్లుగా కనిపించడం లేదంటున్నారు. చంద్రబాబుకు, టిడిపికి దశాబ్దానికి పైగా దూరంగా ఉన్న పురంధేశ్వరి... బిజెపిలో చేరినప్పటి నుండి.. టిడిపితో పొత్తు కుదిరితే తనకు అభ్యంతరం లేదని చెప్పారు. అంతేకాదు పొత్తు కుదిరాక.. అధిష్టానం ఆదేశిస్తే టిడిపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానన్నారు. బాబుతో వేదిక పంచుకునే విషయం పైన కూడా ఆమె విముఖత మాత్రం వ్యక్తం చేయలేదు. అయితే, బాబు మాత్రం ఆమెను పక్కన పెట్టాలని బిజెపిని డిమాండ్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications