పొత్తులపై తుదినిర్ణయం బీజేపీ హైకమాండ్ దే: జనసేన పైనా దగ్గుబాటి పురంధరేశ్వరి వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికల పొత్తుల విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలలో పొత్తులతో పోటీ చేస్తారని ఇప్పటికే ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంటే, బీజేపీ నిర్ణయం మేరకు ఏపీలో పొత్తులు ఖరారు అవుతాయని భావిస్తున్న పరిస్థితి లేకపోలేదు. ఇక రాష్ట్రంలో పొత్తులపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో తేల్చుకోవాల్సింది బీజేపీ టీడీపీ నాయకత్వాలే అని, మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలన్నది తన కీలక ప్రతిపాదన అని వెల్లడించారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి పొత్తుల విషయంలో తుది నిర్ణయం హైకమాండ్ దే అని తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో బిజెపికి జనసేనకు మధ్య ఎటువంటి గ్యాప్ లేదని పేర్కొన్న ఆమె, వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయం అంటూ ప్రకటించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీతో కలిసి పోటీ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేనప్పటికీ, వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూడాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఇటీవల మూడు ఆప్షన్లు చెప్పిన పవన్ కళ్యాణ్ మొదటిది బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రెండవది బీజేపీ టీడీపీ లతో కలిసి అధికారంలోకి రావడం, మూడవది జనసేన ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం అంటూ తన ముందున్న మూడు ఆప్షన్లను చెప్పారు. ఇక బీజేపీ, టీడీపీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఈ క్రమంలోనే బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉందని తెలిపారు. ఇక ఇప్పటికే అనేక మార్లు అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రస్తావన తీసుకు వస్తున్నప్పటికీ బీజేపీ అగ్రనాయకులు మాత్రం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు.ఏపీలోని రాజకీయ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నారు. బీజేపీ జనసేనతో పొత్తు కొనసాగిస్తామని చెబుతూనే, తెలుగుదేశం పార్టీ విషయంలో సైలెంట్ గా ఉంటుంది. మరి పొత్తుల వ్యవహారంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications