ఏపీ బీజేపీ బాస్ గా మాధవ్ బాధ్యతలు-తొలిరోజే నేతల కీలక డిమాండ్..!
ఏపీలో బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన తండ్రి చలపతిరావు కూడా సుదీర్ఘ కాలం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు మాధవ్ ఒక్కరే ఈసారి అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు పోటీగా ఎవరూ రాలేదు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఎంపికైనట్లు జాతీయ నేతలు ఇవాళ ప్రకటించారు.
అనంతరం మాట్లాడిన పీవీఎన్ మాధవ్ రాష్ట్రంలో అందరినీ కలుపుకుని బీజేపీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తయారు చేస్తానని ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయనకు పార్టీ జెండాను ఇచ్చి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన స్పందిస్తూ ఓ చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి జెండాతో ముందుకు వెళ్లాలని నేతల్ని కోరారు. ఆరెస్సెస్ ప్రారంభమై 100 ఏళ్లు, ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన ఈ ఏడాది తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంపై మాధవ్ సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ కు నేతలు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. మాధవ్ నాయకత్వంలో పార్టీ దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అదే సమయంలో మాధవ్ ముందు నేతలు ఓ కీలక డిమాండ్ పెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉన్నా నామినేటెడ్ పదవుల విషయానికొస్తే కేవలం 5 శాతం మాత్రమే ఇస్తున్నారని వాపోయారు.

కొత్త అధ్యక్షుడు మాధవ్ హయాంలో చంద్రబాబుతో మాట్లాడి ఎక్కువ పదవులు వచ్చేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇదే పరిస్ధితి కొనసాగితే మాత్రం స్థానిక పోరులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. దీనికి మాధవ్ కూడా నామినేటెడ్ పదవులపై తాను మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. దీంతో నేతలు శాంతించారు.












Click it and Unblock the Notifications