గుంటూరు ఎస్పీ బదిలీ వెనుక రఘురామ- అమ్మిరెడ్డిపై జగన్ సీరియస్ ?- అందుకే వేటు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం రోజురోజుకూ విమర్శల పాలవుతోంది. సీఐడీతో పెట్టించిన రాజద్రోహం కేసు నిలబడటం కష్టంగా మారుతుండగా.. అటు రఘురామ సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకుని ఎంచక్కా ఢిల్లీ వెళ్లిపోయారు. అంతటితో ఆగకుడా ప్రతిరోజూ కేంద్రమంత్రుల్ని కలుస్తూ జగన్ సర్కార్‌ఫై ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన చేసిన ఓ ఫిర్యాదు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి బదిలీకి కారణమైనట్లు తెలుస్తోంది. గుంటూరు ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డిని డీజీపీ ఆఫీసుకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

రఘురామ కేసులో రోజుకో మలుపు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయనపై సీఐడీ దాఖలు చేసిన రాజద్రోహం కేసు ఓ ఎత్తయితే ఆ తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరో ఎత్తుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీ సర్కార్‌ను అవి ఇరుకునపెట్టేలా ఉన్నాయి. రఘురామరాజు అరెస్టు తర్వాత సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు సైతం అక్షింతలు వేయగా.. ఇప్పుడు గుంటూరు పోలీసుల వ్యవహారశైలి కూడా ఇందుకు కారణమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని ఉన్నపళంగా బదిలీ చేయడమే కాకుండా పోస్టింగ్ కూడా ఇవ్వకుండా డీజీపీ ఆఫీసుకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

రఘురామను డీల్ చేయడంలో వైఫల్యం
హైదరాబాద్‌లో రఘురామరాజు నివాసానికి వెళ్లి ఆయన్ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆయన వైద్య పరీక్షల కోసం పిటిషన్లు వేయడం, వైద్య పరీక్షల తర్వాత తిరిగి ఆయన్ను ఆస్పత్రులకూ, జైలుకు తరలించడం వంటి విషయాల్లో పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఇదంతా ఓ ఎత్తయితే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక రఘురామరాజు సికింద్రాబాద్ ఆర్మీఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాకముందే అక్కడికి గుంటూరు పోలీసులు వెళ్లడం వివాదాస్పదమైంది. ఇవన్నీ చివరికి గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి బదిలీకి కారణమయ్యాయి.

గుంటూరు ఎస్పీ బదిలీ వెనుక ?
గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డిని ప్రభుత్వం నిన్న రాత్రి అకస్మాత్తుగా బదిలీ చేసింది. అదీ పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీసుకు రిపోర్ట్ చేయాలని సూచించింది. దీంతో రఘురామ వ్యవహారాన్ని డీల్ చేయడంలో విఫలమైనందుకే ఆయనపై బదిలీ వేటు పడిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ కాకముందే అక్కడికి గుంటూరు పోలీసులు మప్టీలో వెళ్లడం, ఆయన పెట్టించిన భోజనాలు తిన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారాన్ని వాడుకుని రఘురామరాజు తాజాగా ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌పై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌కు చేసిన ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

జగన్ దిద్దుబాటు చర్యలు
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామరాజు డిశ్చార్జ్ కాకముందే గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి అక్కడికి పోలీసుల్ని పంపడంతో ఆస్పత్రి బయట పోలీసులు ఉన్నారని ఆయన నేరుగా ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కే ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం కాస్తా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో చర్చల్లోనూ ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. చివరికి ఇది గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి మెడకు చుట్టుకుంది. రాజ్‌నాథ్ వరకూ ఫిర్యాదు వెళ్లడంతో ప్రభుత్వమే అమ్మిరెడ్డిని తప్పించడం ద్వారా దిద్దుబాటు చర్యలకు దిగిందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకూ రఘురామతో పాటు ఇతరులు కూడా స్పందించకపోయినా అమ్మిరెడ్డి బదిలీకి రఘురామ కారణమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications