స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి రఘురామ : ఆ మూడు పార్టీల స్కెచ్ - మద్దతు : తాజా సర్వేలో తేలిందిదే..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన చేసారు. తనపైన వేటు వేయించటానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ డిమాండ్ చేసారు. ఈ ప్రకటన చేయటానికి ముందు భారీ కసరత్తు జరిగనట్లు సమాచారం. తిరుపతిలో అమరావతికి మద్దతుగా జరిగిన సభకు ముందే ఈ నిర్ణయానికి స్కెచ్ సిద్దమయినట్లు తెలుస్తోంది. వేటు వేయాల్సిందేనంటూ వైసీపీ అటు బీజేపీ నేతల పైన ఒత్తిడి.. .ఇటు.. వేటు పడకుండా రఘురామ ప్రయత్నాల నడుమ బీజేపీ అగ్రనాయకత్వం సతమతం అవుతోంది. దీంతో.. ఏపీలో జగన్ ను సొంత పార్టీలోనే ఉంటూ వ్యతిరేకిస్తున్న తాను... నేరుగా జగన్ ను ఢీ కొట్టేందుకు బరిలోకి దిగాలని నిర్ణయించారు.

కీలక అంశాలతో సర్వేలు..నివేదికలతో
వాస్తవంగా బీజేపి నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగినా..అందుకు ఆ పార్టీ మద్దతు ఉన్నా.. ఏపీలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులో ఆయన స్వతంత్ర అభ్యర్దిగానే పోటీ చేయాలని భావిస్తున్నారు. తిరుపతి అంశం ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగటం ద్వారా..అమరావతికి మద్దతిస్తున్న పార్టీలు రఘురామకు మద్దతిచ్చేలా తెర వెనుక రాజకీయం నడుస్తోంది. బీజేపీ - జనసేన - బీజేపీ మద్దతుతో రఘురామను గెలిపించాలనేది జగన్ ప్రత్యర్ధి పార్టీ నేతల వ్యూహం. ఆ దిశగా ఒక స్కెచ్ సిద్దం చేసారు. నర్సాపురంలో ఎన్నికలు..పార్టీల ఓట్లు..సామాజిక సమీకరణాలు..వైసీపీ బలం - ప్రస్తుత పాలనలో బలహీనత వంటి అంశాల పైన అధ్యయనం చేసారు. అందులో తేలిన అంశాలతో తాజాగా ఒక సర్వే సైతం చేయించారు. ఆ ఫలితాలతో రఘురామ మరింత ధీమాగా మందుడుగు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

రఘురామ ధీమా వెనుక లెక్కలు..
నర్సాపురంలో దాదాపుగా 12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2014, 2019 రెండు సార్లు వైసీపీకి 4.5 లక్షల ఓట్లు అటూ ఇటూగా వచ్చాయి. అదే సమయంలో బీజేపీ ఇక్కడ రెండు సార్లు గెలిచింది. 1999లో కృష్ణంరాజు, 2014లో గోకరాజు గంగరాజు బీజేపీ అభ్యర్ధులుగా గెలిచారు. 2009 లో ప్రజారాజ్యం అభ్యర్ధికి 2.67 లక్షలు.. 2019లో జనసేన అభ్యర్ధి నాగబాబుకు 2.50 లక్షల ఓట్లు వచ్చాయి. దీని ద్వారా జనసేన మద్దతు ద్వారా ఖచ్చితంగా 2.50 లక్షల ఓట్లు వస్తాయనేది ఒక అంచనా. అదే విధంగా టీడీపీకి గణనీయంగాఓట్ బ్యాంక్ ఉంది. 2019లో వైసీపీ హవాలోనూ ఇక్కడ టీడీపీకి 4.15 లక్షల ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీ చేస్తే.. టీడీపీ - కాంగ్రెస్ మద్దతు సాధ్యం కాదనే కారణంగానే..స్వతంత్ర అభ్యర్దిగా బరిలో నిలిస్తే వారి మద్దతు సులభతరం అవుతుందని నిర్ణయానికి వచ్చారు.

సామాజికంగానూ మద్దతు పొందేలా
ఇక, సంక్రాంతి వేళ రఘురామ రాజు తన సొంత నియోజకవర్గానికి రానున్నట్లు చెబుతున్నారు. అక్కడే తన రాజీనామా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. ఇక, లోక్ సభ స్పీకర్ ఆమోదం తరువాత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, తాజాగా చంద్రబాబు ఏపీలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ధర్మపోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపు నివ్వటంలో తొలి పోరాటం నర్సాపురమేనని వైసీపీ నేతలు సైతం అంచనా వేస్తున్నారు. నర్సాపురం నుంచే జగన్ వర్సెస్ ప్రత్యర్ధి పార్టీల కూటమి మధ్య వార్ ప్రారంభం అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో నర్సాపురంలో క్షత్రియ - కాపు వర్గీయులే ఇప్పటి వరకు ప్రధానంగా పోటీ - గెలవటం జరుగుతూ వస్తోంది.

మూడు పార్టీల మద్దతు - టార్గెట్ జగన్
దీంతో..వపన్ కళ్యాణ్ - వంగవీటి రాధా..కాపు నేతల మద్దతు ప్రచారంలో తీసుకోవటం, క్షత్రియ వర్గానికి చెందిన అశోక్ గజపతి రాజు వ్యవహారం వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో వివరిస్తూ ఆయనను సైతం ప్రచారంలోకి తీసుకురావటం మరో వ్యూహంగా తెలుస్తోంది. వీటన్నింటినీ సమర్ధంగా మేనేజ్ చేయగలిగితే.. వైసీపీని ఎదుర్కోవటం కష్టం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక, ఇప్పటికే రఘురామ రాజుకు చంద్రబాబు మద్దతు పైన వైసీపీ పలు మార్లు ఆరోపించినా.. అమరావతికి మద్దతుగా తిరుపతిలో జరిగిన సభా వేదిక పైన ఇద్దరి ఆలింగనంలో ఓపెన్ గానే తాము ఏం చెప్పదలచుకున్నారో స్పష్టత ఇచ్చేసారు. దీంతో..రఘురామ తన నిర్ణయం ఆషామాషీగా బయట పెట్టలేదని అర్దం అవుతోంది. మరి..దీనికి కౌంటర్ గా వైసీపీ ఎటువంటి ప్లాన్ అమలు చేస్తుందనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications