రఘురామ రాజీనామా: శుభవార్త వినే రోజులు దగ్గర్లో ఉన్నాయ్: ఓపెనింగ్ షాట్: వైసీపీ రెబెల్ ఎంపీ
అమరావతి: తనకు ఎదురు డబ్బులు ఇచ్చి.. వీడియోలను కొన్ని మీడియా సంస్థలు టెలికాస్ట్ చేస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఎదురు డబ్బలు ఇవ్వడానికి తానేమీ మెగాస్టార్ చిరంజీవినో..పవన్ కల్యాణ్‌నో కాదని ఎదురుదాడికి దిగారు. పార్టీ నాయకులు ఇంతగా దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు అర్థమైతే చాలని అనుకుంటున్నానని చెప్పారు. కొత్తగా తాను రాజీనామా చేస్తాననే పుకారును వైసీపీ నాయకులు పుట్టించారని, పలువురు శ్రేయోభిలాషులు తనను ఫోన్ చేసి ఆరా తీస్తున్నారని చెప్పారు.

రాజీనామా చేసే ప్రసక్తే లేదు..
తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, తన లోక్‌సభ సభ్యత్వం రద్దు అవుతుందనడం కూడా కల్ల అని రఘురామ తేల్చి చెప్పారు. తాను పార్టీపరంగా ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని చెప్పారు. తనపై ఇచ్చిన ఫిర్యాదులు, అభియోగాల్లో కొత్తవి ఏవీ లేవని అన్నారు. అయినప్పటికీ- స్పీకర్ ఓం బిర్లాకు తాను వివరణ ఇస్తానని అన్నారు. తమ పార్టీ జాతీయ కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి అసహనంతో కనిపించారని అన్నారు. ప్రధాని ఉండగానే వెల్‌లోకి దూసుకెళ్లిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. రెండు, మూడేళ్లుగా లేని ధైర్యం ఇప్పుడే ఎందుకు కనిపించిందని ఆయన ప్రశ్నించారు.

గాలి వార్తలు..
తాను రాజీనామా చేస్తానంటూ వస్తోన్న లేకి వార్తలు, గాలి వార్తల పట్ల తన అనుచరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రఘురామ అన్నారు. ఈ విషయం గురించి ఆందోళన చెంది, ఆరా తీయడానికి తనకు ఫోన్లు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కొన్ని శుభవార్తలు వినే రోజులు దగ్గరలో ఉన్నాయని రఘురామ జోస్యం చెప్పారు. వాటి గురించి తామందరం ఎదురు చూద్దామని వ్యాఖ్యానించారు. తన రాజీనామా గురించి గానీ, తనపై అనర్హత వేటు గురించి ఎలాంటి వార్తలు అందబోవని స్పష్టం చేశారు. నైతిక విలువల గురించి తమ పార్టీ నేతలు, ప్రత్యేకించి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వలవలు మార్చినంత సులువుగా మార్చుతున్నారని చెప్పారు. అలాంటి వారి మాట వింటే బాధగా ఉందని, కల్లబొల్లి కబుర్లేనని అన్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు డ్యాష్ డ్యాష్‌గా ఉన్నాయని రఘురామ సెటైర్లు వేశారు.

తనపై వేటు వేయడానికి ఓపెనింగ్ షాట్..
తనపై అనర్హత వేటు వేయడానికి ఓపెనింగ్ షాట్‌గా తోటి ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారని రఘురామ ఆరోపించారు. క్రమంగా ఇది తన అనర్హత వేటు అంశం వైపే దారి మళ్లుతుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పని చేస్తే ఆహ్వానించదగ్గదేనని, మనసులో ఒకటి పెట్టుకుని ఆందోళనలు, ఘెరావ్‌లు చేయడం సరికాదని రఘురామ పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. తాను పార్టీని వీడి బయటికి వెళ్లనప్పటికీ.. ఆహ్వానించట్లేదని చెప్పారు.

ఒక సామాజిక వర్గానికే..
ఇటీవల కేటాయించిన ఛైర్మన్ పదవుల్లో అత్యంత కీలకమైనవి, ప్రధానమైన సంస్థలను ఒక సామాజిక వర్గానికే కేటాయించారని రఘురామ విమర్శించారు. ఆ సామాజిక వర్గమేదో తాను చెప్పలేనని అన్నారు. అప్రధానమైన సంస్థలను ఇతర సామాజిక వర్గానికి కేటాయించారని అన్నారు. నేతి బీరకాయలో నెయ్యి, ఎండమావిలో నీళ్లు ఉన్నట్లుగా ఛైర్మన్ల పంపకాలు సాగాయని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ల గురించి ఎవరూ అడగలేదని, దాన్ని విడుదల చేయడం వల్ల తమ ప్రభుత్వం కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్టయిందని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

శివుడి మూడోకన్ను..
తన అనర్హత విషయంలో వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదని రఘురామ అన్నారు. వారిపై నోరు పారేసుకోవద్దని చెప్పారు. నోరు పారేసుకోవడం వల్ల జరిగే నష్టానికి కారణం కావొద్దని సూచించారు. కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా ఉన్నారని, కేంద్రం ఆగ్రహిస్తే శివుడి మూడోకన్ను తెరిచినట్టవుతుందని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోన్నారని, ఆయనే ముఖ్యమంత్రిగా భావిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications